తమిళనాడు రాజకీయాల్లో చిన్నమ్మ శశికళ మళ్ళీ క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎడప్పాడి పళనిస్వామి వర్గం ఆమెను చేర్చుకోవడానికి ససేమిరా అనడంతో, ఆమె తన సొంత రాజకీయ ఉనికిని చాటుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 24న జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె కొత్త పార్టీ పేరు, జెండాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. తన మద్దతుదారులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ, కనీసం 40 నియోజకవర్గాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా ఆమె ప్రణాళికలు రచిస్తున్నారు.
మేనల్లుడు దినకరన్‌తో దూరం దూరం
సీఎం కావాల్సిన సమయంలో ఆమె జైలుకు పోయారు. ఆ సమయంలో మేనల్లుడు టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీని స్థాపించారు. అయితే, ఇటీవల కాలంలో దినకరన్ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి దగ్గరవ్వడం, అన్నాడీఎంకేతో సయోధ్యకు ప్రయత్నించడం శశికళకు నచ్చలేదు. తన రాజకీయ వారసత్వంపై పట్టు కోల్పోకూడదనే ఉద్దేశంతో, దినకరన్ పార్టీలో భాగం కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకోవాలని ఆమె భావిస్తున్నారు.
శశికళ ప్రభావం ఉంటుందా?
శశికళ కొత్త పార్టీ పెట్టడం వల్ల తమిళనాడు రాజకీయాల్లో కదిలిపోయే మార్పులు రాకపోవచ్చు కానీ ఎంతో కొంత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో బలంగా ఉన్న తేవర్ సామాజిక వర్గం ఓట్లు చీలే ప్రమాదం ఉంది. ఇది ప్రధానంగా అన్నాడీఎంకే ఓటు బ్యాంకును దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె సొంతంగా గెలిచే స్థాయికి చేరుకోకపోయినా, కీలక నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్పాయిలర్ గా మారే అవకాశం ఉంది. పన్నీర్ సెల్వం వంటి అసంతృప్త నేతలు ఆమెతో జతకడితే ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
జయలలిత వారసురాల్ని తానేనని నమ్మించగలరా?
జయలలిత ఉన్నప్పుడు శశికళదే రాజ్యం. అన్నాడీఎంకే ఆమె గుప్పిట్లో ఉండేది. చనిపోయిన తర్వాత కూడా అదే జరిగింది. చివరికి తాను సీఎం అవ్వాలని అనుకోవడంతోనే ఆమె జాతకం మారిపోయింది. జైలుకెళ్లిపోయారు. జైలు శిక్ష పడటంతో చట్టపరమైన చిక్కులు, సుదీర్ఘ కాలం రాజకీయాలకు దూరంగా ఉండటం శశికళకు పెద్ద మైనస్ పాయింట్లు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం కూడా 2026 బరిలో ఉండటంతో యువత ఓట్లు అటువైపు మళ్లే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో జయలలిత నిజమైన వారసురాలిగా ప్రజలను మెప్పించడం ఆమెకు పెద్ద సవాల్‌గా మారనుంది.
