డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. నిర్మాతకు మంచి లాభాల్ని మిగిల్చాయి. సిద్దు జొన్నలగడ్డ ‘స్టార్ బోయ్’ ఇమేజ్ సొంతం చేసుకొన్నాడు. అయితే ఆ తరవాత వచ్చిన ‘జాక్’, ‘తెలుసు కదా’ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ‘బ్యాడ్ యాజ్’ సినిమా చేస్తున్నాడు. ఇదో కొత్త టైపు కథ. కాకపోతే సిద్దు మళ్లీ ‘డీజే టిల్లు ‘ అవతారం ఎప్పుడు ఎత్తుతాడా? అని అంతా ఎదురు చూస్తున్నారు. అందుకు సిద్దు రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. `సిద్దు క్యూబ్` కథ, దాని సరంజామా ఓ వైపు రెడీ అవుతున్నాయి. టిల్లు క్యూబ్ కి సంబంధించిన ఓ టీజర్ కూడా షూట్ చేశారని తెలుస్తోంది. సిద్దు చేయాల్సిన ‘కోహినూర్’ సినిమా పక్కకు వెళ్లిపోవడంతో ఆ స్థానంలో `టిల్లు క్యూబ్` సినిమా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. ఈ యేడాది చివర్లో గానీ, 2026 ప్రారంభంలో కానీ టిల్లు క్యూబ్ మొదలయ్యే అవకాశం ఉంది.
టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది? అనే ఐడియా కూడా సిద్దు దగ్గర ఉంది. ఈమధ్య సూపర్ హీరో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ‘హనుమాన్’, ‘మిరాయ్’ అలాంటి కథలే. ఆ స్ఫూర్తితోనే టిల్లుని సూపర్ హీరోని చేయాలని ఫిక్సయ్యాడు సిద్దు. టిల్లు 4గా సూపర్ హీరో కథే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. టిల్లుని హారర్, థ్రిల్లర్ జోనర్లు కూడా టిల్లుతో మిక్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టిల్లు ఫ్రాంచైజీ కనీసం అరడజను సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నాడు సిద్దు. మరోవైపు టిల్లు ప్రభావం తనపై పడకుండా ఉండాలని కూడా చూసుకొంటున్నాడు. ప్రతీసారి టిల్లు లాంటి పాత్ర దొరకదు. వేరే పాత్రల్లో సిద్దుని చూడలేకపోతున్నాం. అందుకే టిల్లు ఎఫెక్ట్ నుంచి బయట పడాలనుకొంటున్నాడు. కాకపోతే టిల్లుకి ఉండే కమర్షియాలిటీ, క్రేజ్ మిగిలిన కథల్లో దొరకడం లేదు. సిద్దుకి ఇదో వింత పరిస్థితి.
