స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటర్ల జాబితాను సమగ్రంగా ప్రక్షాళన చేయడంపై ఇప్పుడు కాంగ్రెస్ కూటమి పార్టీలు ఫైర్ అవుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలను కూడా స్తంభింపచేయడానికి రెడీ అయ్యాయని తొలి రోజే స్ఫష్టమయింది. అసలు సర్ వల్ల ఈ పార్టీలకు వస్తున్న ఇబ్బంది ఏమిటన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఎందుకంటే అర్హులైన వారి ఒక్కరి ఓటు కూడా గల్లంతు కాదని ఈసీ స్పష్టత ఇచ్చింది. బీహార్లో తాము అర్హులమని..తమ ఓటు గల్లంతు అయిందని ఒక్క ఓటర్ కూడా ఫిర్యాదు చేయలేదు. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.
ఓటర్ల జాబితాలో లోపాల వల్లే ఓటింగ్ పర్సంటేజీలో తేడాలు
ఓటర్ల జాబితాలో లోపాల వల్ల.. ఓటింగ్ శాతం లో తేడాలు వస్తున్నాయి. చనిపోయిన వారు.. శాశ్వతంగా వలసపోయిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండటం వల్ల.. పర్సంటేజీ తగ్గుతోంది. అదే సమయంలో సరిహద్దు రాష్ట్రాల్లో బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారు తిష్టవేసి ఓటర్లుగా మారుతున్నారు. దేశం మనది.. వాళ్లు ఓటర్లు అయితే ఎలా ఉంటుంది ?. అందుకే అనర్హులైన వారిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. దీన్ని కూడా విపక్ష పార్టీలు తప్పు పడుతున్నాయి. ఎలాగైనా అడ్డుకోవాలని అంటున్నాయి.
భారతీయులు కాని వారికి ఓటు హక్కు ఎందుకు ?
పని ఒత్తిడితో బూత్ లెవల్ ఆఫీసర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ ముఫ్ఫై మంది చనిపోయారని.. సర్ ప్రక్రియను ఆపేయాలని అంటున్నారు. అయితే పని ఒత్తిడి తగ్గించడానికి పనిని ఆపాల్సిన పని లేదు. యూపీలో ప్రస్తుతం ఎక్కువ వివాదం రేగుతోంది. బెంగాల్ లో చాలా మంది బంగ్లాదేశీయులు వెనక్కి వెళ్లిపోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. బంగ్లాదేశ్, అస్సాంతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇతర దేశాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున అక్రమంగా వలస వచ్చారు. వారంతా ఇక్కడి ధృవీకరణ పత్రాలు పొంది ఓటర్లుగా మారుతున్నారు. వారిని సమర్థించి.. వారికి ఓటు ఉండాల్సిందే అంటే…అది దేశానికి నష్టం చేసినట్లే అవుతుంది.
ఓటు చోరీ పోరు ఏమయింది ?
ఈ వివాదం 2026లో జరగనున్న పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు ఎన్నికలకు సర్ ప్రక్రియ కీలకం. అక్కడ బెంగాల్, తమిళనాడుల్లో అధికార పార్టీలు స్థానిక పార్టీలే. బీఎల్వోలు అంతా వారి అధీనంలోనే ఉంటారు. అయినా ఈ ప్రక్రియ వద్దని అంటున్నారు. ఓట్ చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన రాజకీయం తేలిపోయింది. ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు సర్ ప్రక్రియనూ ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఈ విషాయన్ని గుర్తించలేక.. రాజకీయం చేసి.. ప్రజల వద్ద చులకన అవుతున్నారు. సర్ అనేది మంచి పాలనా సంస్కరణగా నిలుస్తోంది. దాన్ని అన్ని పార్టీలు ఆహ్వానిస్తేనే మంచిది లేకపోతే ప్రజలు ఆయా పార్టీల్ని వ్యతిరేకిస్తారు.
