ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ వినతుల్ని సిట్ నిరాకిరంచింది. విచారణ కోసం కేసీఆర్ కోరిన ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు రావడానికి సిట్ నిరాకరిస్తూ, హైదరాబాద్‌లోని నందినగర్ నివాసాన్నే వేదికగా ఖరారు చేసింది. కేసీఆర్ 65 ఏళ్లు పైబడిన వ్యక్తి కావడంతో సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఆయన నివాసంలోనే విచారించాల్సి ఉంటుంది, అయితే భద్రత, దర్యాప్తు సౌలభ్యం దృష్ట్యా హైదరాబాద్ నగర పరిధిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
మరోవైపు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు విచారణను వాయిదా వేయాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ వేచి ఉండలేమని నోటీసుల ద్వారా స్పష్టం చేసింది. కేవలం ఒక్క రోజు వ్యవధి ఇచ్చి ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రిని నేరుగా ప్రశ్నించేందుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం, విదేశీ పరికరాల వినియోగంస హార్డ్ డిస్క్‌ల ధ్వంసం వంటి తీవ్రమైన ఆరోపణలపై సిట్ ఆయన్ని ఆరా తీయనుంది.
అయితే కేసీఆర్ విచారణకు హాజరవుతారా.. నోటీసులను కోర్టులో సవాల్ చేస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఆయన కోర్టుకెళ్లే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నోటీసులు చెల్లవని బీఆర్ఎస్ న్యాయవాదులు ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు.
