సాధారణంగా మండే ఎండలకు, విశాలమైన ఇసుక తిన్నెలకు పేరుగాంచిన సౌదీ అరేబియాలో ఇప్పుడు మంచుకొండలు కనిపిస్తున్నాయి. దేశంలోని ఉత్తర ప్రాంతాలు మంచు దుప్పటిని కప్పుకుని, ఎడారి దేశం కాస్తా కాశ్మీర్‌ను తలపిస్తోంది. ఈ పరిణామం కొంత మందిలో ఆనందం కలిగిస్తూంటే చాలా మంది ప్రకృతి వైపరీత్యాన్ని చూస్తున్నారు.
సౌదీ ఎడారిలో మంచు వింత:
సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాలైన తబుక్, అల్-జాఫ్ , హైల్ రీజియన్లలో గత కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. ముఖ్యంగా జబల్ అల్-లాజ్ పర్వత శ్రేణులు మంచుతో పూర్తిగా నిండిపోయాయి. ఎడారిలోని ఇసుక తిన్నెలపై మంచు పేరుకుపోవడంతో ఆ ప్రాంతమంతా తెల్లటి దుప్పటి కప్పినట్లు కనిపిస్తోంది. గత 30 ఏళ్లలో ఈ స్థాయిలో మంచు కురవడం ఇదే తొలిసారి అని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
వాతావరణ మార్పులే కారణమా?
ఈ అసాధారణ వాతావరణ మార్పులకు గ్లోబల్ వార్మింగ్ మరియు క్లైమేట్ చేంజ్ ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అరేబియా సముద్రం నుంచి వచ్చిన అల్పపీడన ద్రోణి, ఉత్తర ధ్రువం నుంచి వచ్చిన చల్లటి గాలులతో తోడవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా -4 డిగ్రీల సెల్సియస్ కంటే కిందకు పడిపోయాయి. ఇది ఎడారి వాతావరణంలో తేమను మంచుగా మార్చి, అరుదైన మంచు వర్షానికి దారితీసింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు తెగ వైరల్ అవుతున్నాయి. మంచులో ఒంటెలు నడుస్తున్న వీడియోలు, ఇసుకపై మంచు పేరుకుపోయిన ఫోటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఇది నిజంగా సౌదీ అరేబియానా? లేక ఏవైనా AI సృష్టించిన చిత్రాలా? అని సందేహించేంతగా ఆ దృశ్యాలు ఉన్నాయి. స్థానికులు కూడా ఈ అరుదైన వింతను చూసేందుకు పెద్ద ఎత్తున పర్వత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
ఇటీవలి కాలంలో వరదలు కూడా !
ఈ అసాధారణ మంచు కురవడంతో పాటు భారీ వర్షాలు కూడా కురుస్తుండటంతో సౌదీ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. దుబాయ్, ఖతార్ వంటి పొరుగు దేశాల్లో కూడా అస్థిరమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తుండటం, భవిష్యత్తులో పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందనడానికి ఇది ఒక సూచికగా నిలుస్తోంది. ఇప్పటికి ఆనందం కలిగించవచ్చు కానీ ఇది విధ్వంసానికి సూచనగా భావిస్తున్న వాళ్లు ఎక్కువగా ఉన్నారు.
