దేవిశ్రీ ప్రసాద్ అనగానే ఐటెమ్ పాట గుర్తొస్తుంది. ఆయన ఓ థీమ్ ప్రకారం ఐటెమ్ పాటను కంపోజ్ చేస్తారు. దేవిశ్రీ ప్రసాద్ ఆల్బమ్ లో ఒక్క పాటైనా ఐటెమ్ సాంగ్ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు. పవన్ కల్యాణ్ చిత్రాలకు దేవి పాటలు కంపోజ్ చేసినప్పుడల్లా ఓ ఐటెమ్ పాట తప్పకుండా ఉండేది. ‘గబ్బర్ సింగ్’ లో ‘కెవ్వు కేక’ ఇచ్చిన వైబ్రేషన్స్ ఇప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు మళ్లీ పవన్ – హరీష్ – దేవిశ్రీ ప్రసాద్ కలిసి పని చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం. మరి ఈ సినిమాలో ఐటెమ్ గీతాలెన్ని? అసలు ప్రత్యేక గీతాలకు ఛాన్స్ ఉందా? అనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ‘ఈ సినిమాలో ప్రత్యేక గీతాలంటూ ఉండవు. కానీ ప్రతీ గీతం ప్రత్యేకంగా ఉంటుంది’ అని ఓ ట్వీట్ చేశారు. అంటే.. ఐటెమ్ పాటకు ఈ సినిమాలో ఛాన్స్ లేదన్నమాట.
అయితే.. ఈ సినిమా కోసం విడుదల చేసిన ‘దేఖ్ లేంగే సాలా’ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. రెండో పాట విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈపాటలో పవన్ కల్యాణ్ తాలుకూ వ్యక్తిత్వం ప్రతిబింబించనుందని టాక్. ఈ పాట కూడా ఫ్యాన్స్ ని జోష్ లో నింపడం ఖాయంగా కనిపిస్తోంది. మరో మూడు పాటలకు ఛాన్స్ వుందని, అవన్నీ ఒకొక్కటిగా విడుదల చేస్తారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ అంటే.. పాటల విషయంలో కంగారు పడాల్సిన పనిలేదు. పైగా ఆయన పవన్ కల్యాణ్ సినిమాలకు పని చేసినప్పుడల్లా హిట్ ఆల్బమే ఇచ్చారు. ఈసారీ అదే ఖాయం చేసుకోవొచ్చు.
‘గబ్బర్ సింగ్’ అనగానే అంత్యాక్షరి సీన్ గుర్తొస్తుంది. `ఉస్తాద్`లో కూడా అలాంటి సెటప్ ఒకటుంది. అదేమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మార్చి చివరి వారంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
