ఓ సినిమా జనంలోకి వెళ్లడానికి చాలా అంశాలు దోహదం చేస్తాయి. ఫలానా హీరో, ఫలానా దర్శకుడు కలిసి పని చేస్తున్నారు అనగానే అక్కడ్నుంచే క్రేజ్ మొదలైపోతుంది. ఆ దర్శకుడు ఫామ్ లో ఉండి, హీరోకీ కాస్తో కూస్తో క్రేజ్ ఉంటే… ఇక ఆ సినిమా చూసుకోవాల్సిన పనిలేదు. బిజినెస్ కి మంచి ఊతం దొరికేస్తుంది. హిట్ హీరో, హిట్ దర్శకుడు కలిసి పని చేస్తే నిర్మాత కూడా ముందు నుంచీ కాస్త సేఫ్ జోన్లో ఉంటాడు. బిజినెస్ పరంగా కంగారు పడాల్సిన పనిలేదు. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ లను సెట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.
టాలీవుడ్ లో ఇప్పుడు ఓ కొత్త కాంబో వినిపిస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తున్నాడని, మైత్రీ మూవీస్ ఈ సినిమాని నిర్మించబోతోందని టాకు. ఇది ఎంత వరకూ నిజమో తెలీదు కానీ, కాంబో పరంగా చాలా సర్ప్రైజ్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే శ్రీనువైట్లకు హిట్లు లేవు. నితిన్ దీ అదే దారి. వీళ్లిద్దరూ కలిసి పని చేస్తున్నారంటే.. మార్కెట్ లో ఆసక్తి ఎందుకు ఏర్పడుతుంది? ఈ ఇద్దరితో సినిమా చేయాలని మైత్రీకి ఎందుకు అనిపించింది? నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా, ముందుకు వెళ్తుందా? అనే అనుమానాలు బోలెడన్ని.
ఫ్లాపులో ఉన్న దర్శకుడు, హిట్ లేని హీరో సినిమాలు తీయకూడదని ఎక్కడా లేదు. ఏమో… గుర్రం ఎగరా వచ్చు. ఆ కాంబో హిట్ కొట్టావచ్చు. కాకపోతే మార్కెట్ సినారియో అలా లేదు. అంతా హిట్ వెనుకే పరుగులు పెడుతున్నారు. కథ ఎలా ఉన్నా, కాంబో పరంగా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో శ్రీనువైట్ల, నితిన్ కాంబో సెట్ అవ్వడం విచిత్రమే. శ్రీనువైట్లతో గోపీచంద్ కలిసి సినిమా చేసినప్పుడు కూడా ఆ కాంబో అంతే విచిత్రంగా అనిపించింది. అప్పటికి వాళ్లిద్దరూ ఫామ్ లో లేరు. ‘విశ్వం’ సినిమాతో శ్రీనువైట్ల రూటు మార్చాడని, ఈసారి హిట్టు కొట్టడం ఖాయం అని టీమ్ గట్టిగా చెప్పింది. తీరా చూస్తే… శ్రీనువైట్లా మారలేదు, ఆ ఫలితమూ మారలేదు.
నితిన్ ఇప్పుడు ఓ భారీ హిట్ కొట్టి, తన కమ్ బ్యాక్ ఘనంగా చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తరుణంలో శ్రీనువైట్లతో సినిమా చేయడం ఓ సాససమే. కథ అంతగా నచ్చిందో, లేదంటే… శ్రీనువైట్ల ఈసారి మ్యాజిక్ చేస్తాడని బలంగా నమ్మాడో, లేదంటే.. తాను ఎలాగూ ఫ్లాపులోనే ఉన్నాడు కాబట్టి, కొత్తగా వచ్చే నష్టం లేదని ఫిక్సయ్యాడో తెలీదు కానీ… ఈ కాంబో పట్టాలెక్కితే.. ఆశ్చర్యమే. మేకింగ్ దశలో క్రేజ్ వచ్చి, అందరి దృష్టీ తమవైపు తిప్పుకోగలిగితే అదో అద్భుతమే.