తిరుమల లడ్డూ కల్తీ ఉదంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి తన సొంత బంధువు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రూపంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్ని రోజులుగా జగన్ రెడ్డి , సాక్షి మీడియా బృందం లడ్డూ వివాదంలో తమకు క్లీన్ చిట్ వచ్చిందని, అదంతా కేవలం చంద్రబాబు సృష్టించిన అబద్ధమని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. సిట్ రిపోర్టులో తమ తప్పేమీ లేదని బుకాయించే ప్రయత్నం చేస్తుండగా, వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు వైసీపీ వాదనను పూర్తిగా గాలికి వదిలేశాయి.
కల్తీ నిజమని అంగీకరించిన సుబ్బారెడ్డి
లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించిన మాట వాస్తవమేనని ఆయన బహిరంగంగా అంగీకరించడం ఇప్పుడు పార్టీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది.
నిజానికి సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ప్యూర్ కౌ ఘీ కి బదులుగా రసాయనాలతో కలిపిన సింథటిక్ నెయ్యిని, పామాయిల్ , ఇతర నూనెల మిశ్రమాన్ని సరఫరా చేశారని విచారణలో తేలింది. అయితే వైసీపీ మాత్రం జంతువుల కొవ్వు కలవలేదు కాబట్టి అదంతా అబద్ధం అనే కోణంలో ప్రజలను మభ్యపెట్టాలని చూసింది. కానీ, వైవీ సుబ్బారెడ్డి ఒక అడుగు ముందుకు వేసి అవును, కల్తీ జరిగింది.. కానీ అది అధికారుల వల్ల , ధర్డ్ పార్టీ వ్యక్తుల వల్ల జరిగి ఉండవచ్చు అని వ్యాఖ్యానించడం ద్వారా అసలు కల్తీ అనే నిజాన్ని ధృవీకరించారు. కల్తీ జరగలేదని జగన్ చెబుతుంటే, జరిగింది కానీ మా ప్రమేయం లేదని సుబ్బారెడ్డి చెప్పడం వైసీపీ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది.
వైసీపీకి మింగలేక.. కక్కలేని పరిస్థితి
ఈ పరిణామం జగన్ రెడ్డికి మింగలేక కక్కలేని పరిస్థితిని కల్పించింది. ఇప్పటివరకు తాము చేస్తున్న నిర్దోషిత్వం ప్రచారాన్ని సొంత పార్టీ సీనియర్ నేత, మాజీ టీటీడీ చైర్మనే పటాపంచలు చేయడంతో సాక్షి మీడియా కూడా డిఫెన్స్‌లో పడిపోయింది. సుబ్బారెడ్డి నిజం ఒప్పుకోవడంతో, ఇకపై కల్తీ జరగలేదని చెబితే అది పచ్చి అబద్ధమని జనం ఇట్టే కనిపెట్టేస్తారు. ఒకవేళ సుబ్బారెడ్డి చెప్పినట్లే కల్తీ జరిగిందని ఒప్పుకుంటే, నాలుగేళ్ల పాటు టీటీడీ చైర్మన్‌గా ఉండి ఆ కల్తీని ఎందుకు అరికట్టలేకపోయారనే ప్రశ్న వస్తుంది. వెరసి, సుబ్బారెడ్డి చేసిన ఈ సెల్ఫ్ గోల్ రాజకీయంగా వైసీపీకి భారీ నష్టాన్ని చేకూర్చింది.
సుబ్బారెడ్డిపై అసహనంతో జగన్
ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి తీరుపై జగన్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. పార్టీ లైన్ దాటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వంపై బురద చల్లే అవకాశం పోయి, రివర్స్‌లో వైసీపీనే దోషిగా నిలబడాల్సి వచ్చిందని ఆయన భావిస్తున్నారట. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో.. నిజాలు నిలకడ మీద బయటపడుతున్న కొద్దీ వైసీపీ డిఫెన్స్‌లో పడిపోతోంది. కల్తీని కప్పిపుచ్చడానికి జగన్ రెడ్డి పడుతున్న పాట్లు, సొంత మనుషుల నిజాయితీ వ్యాఖ్యల ముందు నిలబడలేక ఆవిరవుతున్నాయి.
