ఆందోళనకరంగా ఆత్మాహుతులు

తెలంగాణలో ఇటీవల వరుసగా ఆత్మాహుతి ప్రయత్నాలు ఆత్మహత్యలు ఆందోళనకరంగా సాగుతున్నాయి. వీటిని రాజకీయంగానే గాక సామాజిక సమస్యగానూ చూడవలసి వుంది. గతంలో ఎన్నడూ లేనట్టు రాష్ట్రం కోసం ఉద్యమ కాలంలో ఆత్మహత్య అన్నది ఒక త్యాగంగా ప్రచారం జరిగింది. ఆ విధంగా తమ వారిని కోల్పోయిన చాలా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం ప్రకటించినా ఇప్పటికీ చాలామందికి అందలేదని అంటున్నారు. అదలా వుంచితే ఇటీవల వరుసగా సమస్యలతో ఆత్మహత్యలు, అందుకు ప్రయత్నాలు చూస్తున్నాం. చాలామంది పోలీసు అధికారులే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కామారెడ్డి జిల్లా భిక్కనూరు సిఐ జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్న హౌం గార్డు శివ రాష్ట్రం వచ్చినా పరిస్థితులు మారలేదని సమస్యలు తీరలేదని నోట్‌ రాసిపెట్టి ప్రాణాలు తీసుకున్నాడు. వికారాబాద్‌ జిల్లా మోత్కుపల్లిలో అప్పుల బాధ భరించలేక రైతు దంపతులు ఆత్మహత్యకు పాల్పడగా భార్య మరణించి భర్త కొనప్రాణంతో మిగిలారు. పూర్వపు కరీం నగర్‌ జిల్లాలో గూడెం అనే గ్రామంలో దళితులకు భూ పంపిణీలో పాలకపక్ష ముఠాతగాదాల వల్ల తమకు అన్యాయం జరిగిందని ఇద్దరు దళితయువకులు ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్‌ కార్యాలయం దగ్గర ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తాండూరులో టిఆర్‌ఎస్‌ కార్యకర్త ఒకరు పదవులు రాలేదని నాయకుల ఎదుటే ఆత్మాహుతికి ప్రయత్నం చేశారు.సిఎం నివాసం ప్రగతి భవన్‌ ముందు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఉదంతాలున్నాయి. పైగా వీరంతా వివిధ తరగతులకు చెందిన వారు. సమస్యల తీవ్రతకూ సంకేతంగా ఈ సంఘటనలను చూసి పరిష్కార చర్యలు తీసుకోవాలే తప్ప రాజకీయ కుట్రల పేరిట లేక వ్యక్తిగత సమస్యల పేరిట నిర్లక్ష్యం చేస్తే ఇవి ఇంకా పెరిగే ప్రమాదం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.