నటుడు విజయ్ సినిమా జననాయగన్ ఎదుర్కొంటున్న కష్టాలు ముగిసేలా కనిపించడం లేదు. ఈ చిత్ర నిర్మాతలకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేసును త్వరితగతిన విచారించాలని కోరుతూ నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఈ వివాదంపై మద్రాస్ హైకోర్టునే ఆశ్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
వాస్తవానికి జనవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం, సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం ఎదురుచూస్తోంది. విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం ద్వారా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించకముందు నటిస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఈ పిటిషన్ను విచారించడానికి మేము మొగ్గు చూపడం లేదు అని తేల్చి చెప్పింది. అంతేకాకుండా, నేరుగా సుప్రీంకోర్టుకు రావడంలో నిర్మాతలు చూపిన అత్యుత్సాహాన్ని కోర్టు తప్పుబట్టింది. సెన్సార్ క్లియరెన్స్ కోరుతూ చేసిన విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చిన కోర్టు, ఈ అప్పీలుపై జనవరి 20న నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టును ఆదేశించింది.
నిర్మాతల తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ.. ఇది ఒక సినిమాకు సంబంధించిన అంశమని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. అయినప్పటికీ, సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని హైకోర్టు పరిధిలోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
