టిఆర్‌ఎస్‌ టిడిపి పొత్తు సాధ్యమేనట! మరి రేవంత్‌ మాట?

ఎపి,తెలంగాణల్లో శాసనసభ స్థానాల పెంపుదల కోసం కలసి పనిచేయాలని ఉభయ ముఖ్యమంత్రులు అంగీకారానికి వచ్చారని పతాకశీర్షికలొచ్చాయి. అదయ్యాక టిటిడిపి నేతలు చంద్రబాబు నాయుడుతో సమావేశమైనప్పుడు కెసిఆర్‌తో జరిపిన ఈ చర్చల గురించి ప్రస్తావిస్తే ఆయన చిరునవ్వులు చిందించారని, సరదాగా ఏదో అన్నారని మరో కథనం. అయితే ఇదే ఊపులో ఆయన మరికొన్ని సంకేతాలు ఇచ్చారట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టిడిపికి టిఆర్‌ఎస్‌ కొన్ని స్థానాలు కేటాయించే అవకాశముందన్న అభిప్రాయం కలిగించారట. ఆ సమావేశంలో పాల్గొన్న ఒక నాయకుడు మాతో ఇష్టాగోష్టిగా చెప్పిన మాట ఇది. ఇదెలా సంభవమంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేకదా అంటున్నారు టిటిడిపి నేతలు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కెసిఆర్‌పై వూరికే నిప్పులు కక్కడం ఆయన స్వంత వ్యవహారమే గాని అదే పూర్తిగా తమ పార్టీ విధానం కాదని కూడా ఆ నాయకుడు వివరించారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌తో కలిపి పోటీ చేయడంపై చేసిన వ్యాఖ్యలు కూడా చంద్రబాబుకు రుచించలేదట. అయితే ఆ విషయమై మరీ తీవ్రంగా ఖండించగల మందలించగల స్థితిలో ఆయన లేరన్నది పార్టీ వర్గాల అంచనా. రేవంత్‌ 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై సూటిగానే మాట్లాడారు.1996లో మా పార్టీ నేతలు కాంగ్రెస్‌పై ఆధారపడిన మంత్రివర్గంలో సభ్యులుగా వున్నారని గుర్తు చేశారు. ఒక వరలో రెండుకత్తులు ఇమడవంటూ తాను కెసిఆర్‌ ఒకే పొత్తులో వుండబోమని చెప్పారు. ఈ ఇద్దరూ సమవుజ్జీలా, అసలు టిఆర్‌ఎస్‌ అధినేత టిడిపికి నాలుగుసీట్టు ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంటారు లాటి కొన్ని ప్రశ్నలున్నాయి. అయితే తెలంగాణలో ఆంధ్ర ప్రజల సంఖ్య గణనీయంగా వుంటుంది గనక- రెండు రాష్ట్రాల సఖ్యత నెపంతో ఈ రాజకీయ అవగాహన మింగించవచ్చుని టిడిపి అనుకుంటుండొచ్చు. ఈ విషయంలో బిజెపి కూడా తమకు సహాయం చేస్తుందని అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.