సర్కారుకు సదావర్తి దెబ్బ- 5 కోట్ల ఆఫర్‌కు ఆర్కే ఒకే

మంగళగిరి ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి వరస కేసులతో పదునైన వాదనలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో మంచి పట్టు సాధించారు. గతంలో భూసమీకరణ కేసుల్లోనూ,స్విస్‌ చాలెంజి విషయంలోనూ, ఓటుకు నోటు కేసులోనూ చంద్రబాబు ప్రభుత్వాన్ని తెలుగు దేశం పార్టీని రాజకీయంగా కంగారు పెట్టారు. ఈ పరంపరంలో భాగంగా ఇప్పుడు సదావర్తిభూముల విషయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలకమైన తీర్పు రావడానికి కారకులైనారు. చెన్నైలోని సదావర్తి భూముల విలువ వెయ్యికోట్లకు పైగా వుంటుందనీ, కాని ప్రభుత్వం ఎకరా 28లక్షల చొప్పున కారుచౌకగా తన వారికి కట్టబెట్టిందని ఆయన వాదన. మొదట ఆ సమస్యే లేదన్న రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఒప్పుకుని తామే కాపాడమన్నట్టు మాట్లాడింది. అనేక ఆపసోపాలు పడింది. గతంలో ఈ కేసులో న్యాయస్థానం ఇప్పుడు 22 కోట్లకు ఆ భూములు అమ్ముడు పోయాయి గనక మరో అయిదుకోట్లు అదనంగా మీరిస్తే మీకే భూములు చెందుతాయని ఆర్కేకు ఆఫర్‌ ఇచ్చింది, ఈ వాయిదాలో ఆయన అందుకు అంగీకరించారు.అయితే డబ్బులు ఎక్కడివనే ప్రశ్న రాకుండా తాను కొందరు స్తోమత గల వ్యాపారవేత్తలతో మాట్లాడానని వారు తీసుకుంటారని జాగ్రత్తగా చెబుతున్నారు. వాస్తవం ఏంటే ఆర్కేది పెద్ద వ్యాపార కుటుంబం. రామ్‌కీ అయోధ్య రామిరెడ్డి ఆయన సోదరుడే. కనుక ఈ మొత్తం సర్దుబాటు చేయడం తనకు పెద్ద సమస్య కాదు. అయితే అంతకంటే ముఖ్యమైంది ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఈ భూముల భవిష్యత్తు ఏం చేస్తుంది? ఆర్కేకు అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి. తర్వాత జరిగేదేమిటన్నది ఒకటైతే ఇప్పటికి మాత్రం వైసీపీ ఎంఎల్‌ఎ పై చేయి సాధించి ప్రభుత్వాన్ని ఇబ్బందిలో పడేశారు. ఇప్పటికైనా అన్ని ప్రభుత్వ భూములను దర్మాదాయ భూములను కాపాడ్డం అవసరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.