రోజా విష‌యంలో టీడీపీ నిర్ణ‌యం ఫైన‌ల్‌..!

వ‌చ్చే సోమ‌వారం జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ స‌మావేశాలపై కాస్తంత ఆస‌క్తి ఆంధ్రాలో నెల‌కొంది! ఎందుకంటే, విప‌క్ష పార్టీ ఎమ్మెల్యే రోజా వ్య‌వ‌హారంపై అదే రోజున గొల్ల‌ప‌ల్లి సూర్య‌రావు నేతృత్వంలోని క‌మిటీ రూపొందించిన నివేదిక‌ను ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది! గ‌డ‌చిన ఏడాదిగా అసెంబ్లీ స‌మావేశాల నుంచి రోజా స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది అసెంబ్లీలో ఆమె ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని అవ‌మానించార‌నీ, ఎమ్మెల్యే అనిత విష‌యంలో ఆమె అనుస‌రించిన తీరు అభ్యంత‌రంగా ఉందంటూ స్పీక‌ర్ స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. రాజ‌కీయంగా ఈ విష‌యం పెద్ద దుమారాన్నే లేపింది.

ఆ త‌రువాత ఏర్పాటైన క‌మిటీ ముందు సీఎం విష‌యంలో రోజా కాస్త వెన‌క్కి త‌గ్గినా, ఎమ్మెల్యే అనిత విష‌యంలో మాత్రం క్ష‌మాప‌ణ‌లు చెప్పేది లేదంటూ భీష్మించారు. రోజా బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెబితే త‌ప్ప ఆమెను స‌భ‌లోకి ప్ర‌వేశం లేకుండా చేయ‌లంటూ ఎమ్మెల్యే అనిత ఇప్ప‌టికీ ప‌ట్టుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, ఇటీవ‌లే స్పీక‌ర్‌కు ఈ మేర‌కు ఓ లేఖ కూడా ఆమె ఇచ్చారు. అయితే, ఈ నేప‌థ్యంలో తెలుగుదేశం ఉద్దేశం ఎలా ఉంద‌నేది స్ప‌ష్టంగానే ఉన్న‌ట్టు ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

సోమ‌వారం ఉద‌యం స‌భ ప్రారంభం కాగానే, రోజా విష‌య‌మై త‌యారైన నివేదిక‌ను స‌భ ముందుకు తీసుకుని రావాల‌ని టీడీపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం! అంతేకాదు, స‌ద‌రు నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే రోజాపై ప్ర‌స్తుతం ఉన్న స‌స్పెన్ష‌న్ వేటును మ‌రో ఏడాది పాటు పొడిగించే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. ఇప్ప‌టికే ఈ మేర‌కు టీడీపీ డిసైడ్ అయింద‌ని కూడా కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతూ ఉండ‌టం విశేషం..! ఈ విష‌యంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు వెలువ‌రించే నిర్ణ‌య‌మే ఫైన‌ల్‌.

రోజా విష‌యంలో తెలుగుదేశం కేవ‌లం పంతానికి పోతున్న‌ట్టుగానే ఉంద‌ని అర్థ‌మౌతోంది. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెబితే త‌ప్ప ఈ వ్య‌వ‌హారం ఇక్క‌డితో స‌ద్దుమ‌ణిగే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. అయితే, క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు రోజా సిద్ధంగా ఉన్న‌ట్టు లేరు. ఒక‌వేళ మ‌రో ఏడాదిపాటు నిషేధాన్ని కొన‌సాగిస్తే… ఈ వివాదం మ‌రింత‌గా ముదిరే అవ‌కాశం ఉంది. నిజానికి, త‌ప్పు ఎవ‌రు చేశార‌న్న‌ది కాసేపు ప‌క్క‌న పెడితే… రోజాకి సింప‌థీ పెరిగే ఛాన్సులే ఎక్కువ‌గా ఉంటాయి అని మాత్రం చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com