తెలుగు360 సర్వే : ప్రకాశం జిల్లాలో వలస నేతలతో టీడీపీకి బలం..! అయినా సగం .. సగం.. !

తెలుగు360 జిల్లాల వారీగా అందిస్తున్న సర్వే నివేదికలపై… పాఠకులు అనేక రకాలుగా ఫీడ్ బ్యాక్ పంపుతున్నారు. వారిలో..ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన వారు కూడా ఉన్నారు. వారిలో.. సర్వే ఫలితాలపై కొంత మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది… సర్వే కరెక్టే అని స్పందిస్తున్నారు. ఏదయినా… పార్టీలపై అభిమానం అనే కోణం లేకుండా… విభిన్న వర్గాల ప్రజల అభిప్రాయాలను విశ్లేషించి… తెలుగు360 సర్వేను ప్రకటిస్తోంది. ఇప్పటి వరకూ రాయలసీమలోని కడపతో పాటు… శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకూ.. సర్వే ఫలితాలను ప్రకటించడం జరిగింది. ఈ రోజు ప్రకాశం జిల్లా ఫలితాలు చూద్దాం..!

ప్రకాశం జిల్లాలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. తూర్పు ప్రకాశంలో కోస్తా, ప్రశ్చిమ ప్రకాశంలో రాయలసీమ సంస్కృతి కలగలిసి కనిపిస్తాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ ఈ నియోజకవర్గంలో టీడీపీతో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధించింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఆరింటిని వైసీపీ గెలుచుకోగా.. టీడీపీ ఐదింటితో సరిపెట్టుకుంది. చీరాలలో నవోదయం పార్టీ తరపున నిలబడిన ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు. ఈ సారి జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో.. సర్వేల్లో ప్రజలు ఎలా స్పందించారో… చివరికి ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం..!

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో రాజకీయం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి, జగన్‌ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థిగా షేక్‌ రియాజ్‌ బరిలో ఉన్నారు. దామచర్ల జనార్దన్ గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. బాలినేని మాత్రం.. నాలుగేళ్ల పాటు కనిపించలేదు. కొన్నాళ్ల పాటు జగన్ వైవీ సుబ్బారెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడంతో… పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత వైవీని తగ్గించి… ప్రాధాన్యం ఇవ్వడంతో బాలినేని యాక్టివ్ అయ్యారు. ఒంగోలు నియోజకవర్గంలో మంచి నీటి సమస్యను జనార్ధన్ పరిష్కరించగలిగారు. గతంలో పోలిస్తే.. ఇప్పుడు బాగా మెరుగవడం ప్లస్ పాయింట్ అయింది. పెన్షన్లు సహా.. ఇతర ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాలకూ చేరాయి. జనసేన అభ్యర్థి ముస్లిం కావడంతో… వైసీపీకి పడాల్సిన మైనార్టీ, కాపు ఓట్లు కొన్ని మైనస్ అవనున్నాయి. దీంతో ఈ సారి కూడా.. దామచర్ల జనార్దన్ నే విజయం వరించనుంది.

చీరాల నియోజకవర్గం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఆమంచి కృష్ణమోహన్‌ గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీలో చేరారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆపార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమంచి పార్టీని వీడిన వెంటనే ఎమ్మెల్సీ కరణం బలరాంను టీడీపీ రంగంలోకి తెచ్చింది. దీంతో పరిస్థితి మారిపోయింది. అధికార పార్టీలో ఉండి.. ఇష్టమైన పోలీసుల్ని నియమించుకుని చీరాలలో రాజ్యం చేసిన కృష్ణమోహన్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆయన ఎన్నికల సన్నాహాల కోసం ఏర్పాటు చేసుకున్న మద్యం, చీరలు, గడియారాలు, క్రికెట్ కిట్లు, డబ్బులు.. ఇలా అన్నింటినీ పోలీసులు సోదాలు చేసి మరీ స్వాధీనం చేసుకున్నారు. తాను.. చీరాలలోనే ఉంటాననే భరోసా ఇవ్వడంతో… ఆమంచికి వ్యతిరేకంగా అందరూ బయటకు వస్తున్నారు. మొదట్లో తిరుగులేదనుకున్న పరిస్థితిని నుంచి ఆమంచి ఆత్మరక్షణలో పడిపోయారు. ఎమ్మెల్సీ పోతుల సునీత నియోజకవర్గంలో చేనేతల ఓట్లను టీడీపీకి పడేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తొమ్మిదేళ్ల పాటు వైసీపీ ఇన్చార్జ్ గా ఉన్న యడం బాలాజీ.. టీడీపీలో చేరి కరణం కోసం పని చేస్తున్నారు. హోరాహోరీగా పోరు సాగుతున్నప్పటికీ… గెలుపు మాత్రం.. ఈ సారి కరణం బలరాంనే వరిస్తుందని సమీకరణాలు వెల్లడిస్తున్నాయి. ఇక పర్చూరులో నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మళ్లీ పోటీ చేస్తున్నారు. మొదట తన కుమారుడ్ని నిలపాలని దగ్గుబాటి అనుకున్నారు. పౌరసత్వ సమస్య రావడంతో ఆయనే పోటీ చేస్తున్నారు. గతంలో ఉన్నంత సానుకూలత ఇప్పుడు దగ్గుబాటికి లేదు. ఇప్పటి వరకూ.. వైసీపీ ఇన్చార్జ్ గా ఉన్న రావి రామనాథం బాబు.. టీడీపీలో చేరిపోయారు. ఈ నియోజకవర్గంలో గొట్టిపాటి వర్గం కూడా ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో గొట్టిపాటి భరత్ పోటీ చేసి ఓడిపోయారు. వారు తర్వాత టీడీపీలో చేరారు. ఈ వర్గం ఈ సారి టీడీపీకే పని చేస్తోంది. అక్కడ కరణం బలరాం ప్రభావం కూడా ఉంటుంది. ఈ మొత్తం చూస్తే… దగ్గుబాటి… వైసీపీ బలం కన్నా.. వ్యక్తిగత ప్రాబల్యం మీదనే ఆధారపడ్డారు. పోరు హోరాహోరీగా సాగుతున్నా… దగ్గుబాటి తన అనుభవం, బంధుత్వాల సాయంతో… విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది.

దర్శి నియోజకవర్గంలో ఈ సారి ప్రధాన పార్టీల అభ్యర్థలిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. టీడీపీ కనిగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావును పోటీలో పెట్టారు. ఒకప్పుడు పీఆర్పీ తరపున పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్‌ను వైసీపీ తరపున బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాదరెడ్డి పోటీకి విముఖత చూపారు. వేణుగోపాల్‌కు ఆయన సహకరిస్తున్నారు. అయితే.. నియోజకవర్గంపై శిద్ధా రాఘవరావు పట్టు సాధించారు. ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ కాపు సామాజికవర్గం వారే. పైగా బంధువులు కూడా. చివరి క్షణంలో టీడీపీ అభ్యర్థిత్వం గందరగోళంగా మారడం మైనస్‌గా మారింది. ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థి అడ్వాంటేజ్ సాధించనున్నారు. అద్దంకి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున గొట్టిపాటి రవికుమార్‌ గెలిచి టీడీపీలో చేరారు. ఆయనే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో కలిసి వస్తుందని భావిస్తున్నారు. కరణం బలరాం వర్గం కూడా మద్దతు పలకడంతో మెజార్టీపైనే లెక్కలు వేసుకుంటున్నారు. వైసీపీ తరపున సీనియర్‌ నేత చెంచు గరటయ్య బరిలో ఉన్నారు. కానీ.. పెద్దగా పోటీ లేదని..ఇప్పటికే అంచనాకు వచ్చారు.

మార్కాపురం నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని పక్కనపెట్టి ఈసారి నాగార్జునరెడ్డికి సీటు కేటాయించింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కందుల నారాయణరెడ్డికే ఈసారి టీడీపీ టికెట్‌ ఇచ్చింది. జనసేన అభ్యర్థిగా ఇటీవల వరకు టీడీపీలో పనిచేసిన కాశీనాథ్‌ పోటీ చేస్తున్నారు. టిక్కెట్ దక్కలేదని జంకె వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినా… వైసీపీ నేతలు సర్దుబాటు చేసుకున్నారు. ఇక్కడ ఈ సారి కూడా.. వైసీపీ అభ్యర్థికే అవకాశం ఎక్కువగా ఉంది. గిద్దలూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రత్యర్థులే పార్టీలు మారి మళ్లీ తలపడుతున్నారు. వైసీపీ నుంచి 2014లో గెలిచిన అశోక్‌రెడ్డి తర్వాత టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి అన్నా రాంబాబు వైసీపీలో చేరి టికెట్‌ దక్కించుకున్నారు. పెద్ద సంఖ్యలో అనుచరవర్గం ఉన్న మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి ఇటీవల టీడీపీలో చేరడం కలసి వచ్చే అంశం. జనసేన తరపున చంద్రశేఖర్‌యాదవ్‌ పోటీలో ఉన్నారు. 2009లో ఈ స్థానాన్ని ప్రజారాజ్యం గెలుచుకుంది. అప్పట్లో పీఆర్పీ తరపున అన్నా రాంబాబే గెలిచారు. ఇక్కడ పరిస్థితులు… కరువు, సామాజిక వర్గ సమీకరణాలు అంచనా వేసుకుంటే వైసీపీ అభ్యర్థికే ఎక్కువ అవకాశాలున్నాయి.

కొండెపిలో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, వైసీపీ అభ్యర్థిగా మాదాసి వెంకయ్య పోటీపడుతున్నారు. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు కుటుంబం, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు వర్గాలు ఇక్కడ కీలకం. ఆ రెండు వర్గాలతో పాటు మరో సామాజికవర్గం పూర్తిగా టీడీపీ అభ్యర్థి స్వామి వెంట ఉంది. దీంతో టీడీపీ గెలుపు సునాయసమేనని చెబుతున్నారు. ఒంగోలు పార్లమెంట్‌ సీటును గెల్చుకోవడానికి ఇక్కడ మంచి మెజార్టీని టీడీపీ ఆశిస్తోంది. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌, వైసీపీ అభ్యర్థిగా గుంటూరుకు చెందిన సుధాకర్‌బాబు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బి.ఎన్‌.విజకుమార్‌ తృటిలో విజయం చేజార్చుకున్నారు. సామాజిక సమీకరణాలు కలసి రావడం.. స్థానికేతర అభ్యర్థిని వైసీపీ నిర్ణయించడంతో… ఈ నియోజకవర్గంలో టీడీపీకి అడ్వాంటేజ్ కనిపిస్తోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని అనూహ్యంగా బి.అజితారావును నిలిపింది. 2014లో వైసీపీ తరఫున గెలిచిన డేవిడ్‌రాజు తర్వాత టీడీపీలో చేరారు. అయినా ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో మళ్లీ వైసీపీలో చేరారు. అయితే పెద్దగా ప్రభావం ఏమీ ఉండదని టీడీపీ నిర్ణయానికి వచ్చింది. గత ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి వైసీపీ తరపున గెలిచిన ఆదిమూలపు సురేష్‌ బరిలో నిలిచారు. ఆర్థిక సామర్థ్యం, వైసీపీకి మద్దతిచ్చే సామాజికవర్గ ప్రాబల్యం కారణంగా మరోసారి వైసీపీనే గెలవొచ్చని అంచనా వేస్తున్నారు.

కందుకూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన పోతుల రామారావు టీడీపీలో చేరారు. మరోసారి ఆయన బరిలో నిలిచారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి మహిధర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, రామాయపట్నం పోర్టు, పేపర్‌ పరిశ్రమ వస్తాయనే నమ్మకం కలిగించడం వంటి వాటితో టీడీపీ ధీమాగా ఉంది. పోతుల వర్గం నియోజకవర్గంలో బలంగా ఉండటంతో పాటు.. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన అభ్యర్థి పులి మల్లిఖార్జునరావు.. ఎంత ఎక్కువగా.. ఓట్లు చీల్చుకుంటే.. ఎంత ఎక్కువగా.. టీడీపీ అభ్యర్థికి నష్టం వస్తుందని చెబుతున్నారు. మహిధర్ రెడ్డికి అనుచరగణం ఎక్కువగా ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు… అభివృద్ధి పనులు చేశారు. పోటీ హోరాహోరీగా ఉన్నప్పటికీ.. వైసీపీకే ఎడ్జ్ ఉందన్న అంచనాలున్నాయి. కనిగిరిలో టీడీపీ అభ్యర్థిని మార్చనప్పుడే పరిస్థితులు సానుకూలంగా మారాయన్న అభిప్రాయం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని చివరి నిమిషంలో టీడీపీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. ఆయన ఓ సారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరు ఉంది. వైసీపీ బీసీ కోటాలో గత ఎన్నికల్లో మరోసారి బుర్రా మధుసూదన్‌కే టికెట్‌ ఇచ్చింది. ఆయన ఎక్కువగా బెంగళూరులో గడుపుతారన్న ప్రచారం ఉంది. రెడ్డి సామాజికవర్గం… ఉగ్రకే మద్దతుగా ఉండటంతో పాటు.. సంప్రదాయంగా.. టీడీపీ మద్దతుదారులు కూడా.. ఆయనకే మద్దతిస్తున్నారు. దాంతో విజయం ఈ సారి కూడా.. టీడీపీకే దక్కనుంది.

యర్రగొండపాలెం వైసీపీ ( వైసీపీ హోల్డ్ )
దర్శి వైసీపీ ( గెయిన్ ఫ్రం టీడీపీ )
పర్చూరువైసీపీ ( గెయిన్ ఫ్రం టీడీపీ )
అద్దంకి టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ )
చీరాల టీడీపీ ( గెయిన్ ఫ్రం ఇండిపెండెంట్ )
సంతనూతలపాడు (ఎస్సీ) టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ )
ఒంగోలు టీడీపీ ( టీడీపీ హోల్డ్ )
కందుకూరు వైసీపీ ( వైసీపీ హోల్డ్ )
కొండపి (ఎస్సీ) టీడీపీ ( టీడీపీ హోల్డ్ )
మార్కాపురం వైసీపీ ( వైసీపీ హోల్డ్ )
గిద్దలూరు వైసీపీ ( వైసీపీ హోల్డ్ )
కనిగిరి టీడీపీ ( టీడీపీ హోల్డ్ )

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close