తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న జల వివాదాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రసంగించిన ఇద్దరు నేతలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచడం కంటే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడమే తమ ప్రభుత్వాల ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను విడనాడాలని, తెలుగు జాతి ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు పిలుపుvf;d;ejg.
రాయవరంలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నీళ్లు కావాలా లేక గొడవలు కావాలా అంటే కొందరు గొడవలే కావాలని కోరుకుంటున్నారని ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ ఓ వీరుడు బయలుదేరాడు అని ఎద్దేవా చేస్తూ, ప్రాజెక్టుల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదని తేల్చి చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సమస్యలు ఉంటే కూర్చుని చర్చించుకోవాలని, ప్రజల మధ్య గోడలు కట్టే ప్రసంగాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. తెలుగు జాతి అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
అటు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి సైతం ఇదే తరహాలో స్పందిస్తూ తెలంగాణకు పంచాయితీలు కాదు, నీళ్లు మాత్రమే కావాలని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు పక్క రాష్ట్రం అడ్డుపడవద్దని కోరుతూనే, రాజకీయ లబ్ధి కంటే పరిష్కారాలకే తాను ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. నీటి విషయంలో రాజకీయ లబ్ధి చూడొద్దు.. శాశ్వత పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రంతో చర్చలకు నేను ఎప్పుడూ సిద్ధం అని రేవంత్ ప్రకటించారు. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు వివాదాలకు స్వస్తి పలికి, సామరస్య పూర్వక పరిష్కారాల వైపు మొగ్గు చూపడంతో పరిష్కారాల దిశగా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.


