నిన్నమొన్నటి వరకూ ఎపిలో టిడిపి, అంతకు మించి తెలంగాణలో టిఆర్ఎస్ మళ్లీ గెలవడం ఖాయమన్న మాట వినిపిస్తుండేది. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలుగుదేశంను కలిపేసుకుంటే ఎపి సిఎం చంద్రబాబు నాయుడు వైసీపీ దూకుడుకు కళ్లేలు వేశారని అనుయాయులు గొప్పగా చెప్పేవారు. ఇప్పుడిప్పుడే ఈ ధోరణి కొంత మారుతున్నది. జగన్ బలం తగ్గలేదని టిడిపి ప్రతినిధి ఒకరు అన్న మాటలు నిన్న చూశాం. అదే కోవలో టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధి ఒకరు మాట్లాడారు. మరోసారి తాము అధికారంలోకి రాకపోవచ్చన్న సందేహం వ్యక్తం చేశారు. అంత పోరాటం చేస్తేనే అత్తెసరు మెజార్టితో గెలిచిన ఇటీవల వరసుగా వస్తున్న సమస్యల మధ్య మళ్లీ గెలవడం అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి కెసిఆర్ ఘనత గురించి చాలా ప్రచారం జరుగుతున్నా ఆయన ఎవరినీ కలవకపోవడం, సంతానానికే అన్నిటా పెద్దపీట వేయడం చాలామంది టిఆర్ఎస్ నేతలకు మింగుడుపడటం లేదు. వారసత్వం అన్నిచోట్లా వున్నదే గాని మంత్రి హరీష్ రావుతో సహా మిగిలిన వారిని పూర్తిగా పట్టించుకోకపోవడంపై ఈ నాయకులు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నంతలో డబ్బులున్నవారికి డబ్బులు తేగలిగిన వారికి మాత్రమే ప్రాధాన్యత లభిస్తున్నదని వీరంటున్నారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ గనక సకాలంలో సమర్థంగా వ్యవహరించి వుంటే పరిస్థితి ఇంత ఏకపక్షంగా వుండేది కాదన్నది వారి అంచనా.
జిల్లాల పునర్విభజన, ప్రాజెక్టుల వివాదం వంటివి కూడా వాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పడిపోయిందని వారి విమర్శ. అయితే ప్రజల్లో మాత్రం అసంతృప్తి పెరుగుతున్నదని, కింద క్షేత్రస్థాయిలో వెళ్లినప్పుడు నేతలకు అది అనుభవంలోకి వస్తున్నదని ప్రముఖ వ్యక్తులే చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఇలాటి వ్యాఖ్యలు విమర్శలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
