అలెగ్జాండర్ నుంచి నెపోలియన్ వరకు ఎవరూ అహంకారంతో ప్రపంచాన్ని జయించలేకపోయారు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే బాటలో నడుస్తూ, ప్రపంచ శాంతిని పణంగా పెడుతున్నారు. చరిత్ర ఆయను గుర్తు పెట్టుకుంటుంది. ప్రపంచం ఎంతో కష్టపడి దశాబ్దాల తరబడి నిర్మించుకున్న వాటిని తన ఈగోలతో రోజుల్లోనే సర్వనాశనం చేసిన వ్యక్తిగా అసహ్యించుకుంటుంది.
ప్రపంచ నాగరికత విధ్వంసకుడు ట్రంప్
ట్రంప్‌కు వ్యక్తిగత లాభం తప్ప.. ఏమీ పట్టదని అమెరికాలో అందరూ ఇప్పుడు నమ్ముతున్నారు. కేవలం తాను మాత్రమే కింగ్‌ను అన్నట్లుగా ఏమీ చేసినా చెల్లుతుందన్నట్లుగా.. తరతరాలుగా ప్రపంచం ఇటుక ఇటుక పేర్చి నిర్మించుకున్న అంతర్జాతీయ సహకారం, శాంతి సౌధాన్ని.. ట్రంప్ తన ఈగో అనే మిస్సైల్‌తో కూల్చివేస్తున్నారు. ఇది కేవలం ఒక దేశం పాలసీ కాదు, ఒక నాగరికతపై జరుగుతున్న దాడి. ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న అరాచకం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచం ఒక గొప్ప సత్యాన్ని గ్రహించింది. యుద్ధం వల్ల ఎవరూ గెలవరు, కేవలం ఒక పక్షం తక్కువగా.. మరో పక్షం ఎక్కువగా నష్టపోతాయి అని గుర్తించింది. అందుకే గత ఎనిమిది దశాబ్దాలుగా ప్రపంచ దేశాలన్నీ ఒక ఇటుకపై ఒక ఇటుక పేర్చుకుంటూ అంతర్జాతీయ సహకారం, ఆర్థిక సమగ్రత , మానవ హక్కులతో కూడిన ఒక శాంతి సౌధాన్ని నిర్మించుకున్నాయి. ఐక్యరాజ్యసమితి వంటి వ్యవస్థలు, పారిస్ ఒప్పందం వంటి పర్యావరణ రక్షణలు అన్నీ ఈ నాగరికత ప్రస్థానంలో భాగమే. కానీ దశాబ్దాలుగా నిర్మించుకున్న ఈ శాంతి సౌధాన్ని డొనాల్డ్ ట్రంప్ తన ఈగో భయంకరమైన శాడిజంతో పెకిలించేస్తున్నారు. నాగరికత అంటే కేవలం భవనాలు కట్టడం కాదు, దేశాల మధ్య నమ్మకాన్ని నిర్మించడం. ఇరాన్‌పై దాడుల వల్ల అమెరికా సాధించిందేమిటి.. ఇరాన్ నష్టపోయి ఉండొచ్చు కానీ, అమెరికా కూడా తన ప్రతిష్టను, వనరులను పణంగా పెట్టింది. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాను దెబ్బతీశాయి. చమురు ధరలు బారెల్‌కు 120 డాలర్లు దాటడం వల్ల సామాన్య భారతీయుడి నుంచి యూరోపియన్ పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా దెబ్బతింటున్నారు. ఇది కేవలం అమెరికా-ఇరాన్ సమస్య కాదు. గ్లోబల్ సప్లై చైన్ పై జరుగుతున్న దాడి. ఒక దేశాన్ని లొంగదీసుకోవాలనే మొండితనం, ప్రపంచం మొత్తాన్ని ఆకలిలోకి నెట్టేస్తోంది. ఒక యుద్ధాన్ని ఎలా మొదలుపెట్టాలో తెలిసిన ట్రంప్‌కు, దాన్ని ఎలా గౌరవప్రదంగా ముగించాలో తెలియడం లేదు. మొండివాడు రాజుకన్నా బలవంతుడు అన్నట్లుగా ఇరాన్ పోరాడుతుంటే, ట్రంప్ అసహనంతో అణు దాడుల హెచ్చరికలు చేయడం నాగరిక ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది.
దౌత్యం విఫలం కాకుండానే యుద్ధం చేసిన ట్రంప్
దౌత్యం విఫలమైన చోట యుద్ధం మొదలవుతుంది అంటారు. కానీ, ఇరాన్ విషయంలో దౌత్యం విజయవంతంగా నడుస్తున్న తరుణంలోనే, యుద్ధాన్ని బలవంతంగా రుద్దడం ప్రస్తుత అమెరికా అడ్మినిస్ట్రేషన్ చేసిన చారిత్రక తప్పిదం. 1979 ఇరాన్ విప్లవం తర్వాత దాదాపు 47 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నా, అది ఎప్పుడూ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ స్థాయికి వెళ్లలేదు. కానీ ట్రంప్ అణు ఒప్పందం నుండి ట్రంప్ ఏకపక్షంగా వైదొలగడం అనేది కేవలం ఒక ఒప్పంద ఉల్లంఘన మాత్రమే కాదు, అది అంతర్జాతీయ విశ్వసనీయతపై జరిగిన దాడి. అప్పటి నుండి పక్కా ప్రణాళికతో పెంచిన ఉద్రిక్తతలు నేడు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ రూపంలో విస్ఫోటనం చెందాయి. 2 అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఈ శతాబ్దపు అతిపెద్ద రాజకీయ తప్పిదంగా మిగిలింది. ఈ దాడుల వెనుక ఉన్న అసలు లక్ష్యం పాలనా మార్పు అని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో జరిగింది మాత్రం అందుకు భిన్నం. ఇరాన్ లోని కీలక అణు స్థావరాలు, సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడులు, ఆ దేశ నాయకత్వాన్ని బలహీనపరచడానికి బదులు, ప్రజలందరినీ జాతీయవాదం వైపు మళ్లించి ప్రభుత్వం వెనుక నిలబెట్టాయి. ఫలితంగా అమెరికా ఆశించిన మార్పు రాకపోగా, ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. ఈ దాడుల వల్ల గ్లోబల్ ఎకానమీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద నెలకొన్న అనిశ్చితి వల్ల ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు స్తంభించిపోయింది. ఇది కేవలం చమురు ధరల పెంపుకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు విచ్ఛిన్నం కావడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే ఆత్రుతలో, తన మిత్రదేశాల ఆర్థిక ప్రయోజనాలను కూడా పణంగా పెట్టిందనే విమర్శలు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుండి కూడా వినిపిస్తున్నాయి.
ప్రపంచం మొత్తానికి కష్టాలు..నష్టాలే
ఏ యుద్ధమైనా గెలుపు ఓటముల కంటే విధ్వంసాన్నే ఎక్కువగా మిగిలిస్తుంది. ప్రస్తుత ఇరాన్-అమెరికా ఘర్షణలో ఏ ఒక్క దేశం కూడా ప్రయోజనం పొందలేదనేది చేదు నిజం. ఈ యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక పరిణామాలు కేవలం యుద్ధం చేస్తున్న దేశాలకే పరిమితం కాలేదు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం, అరబ్ దేశాల జీడీపీ సుమారు 120 నుంచి 194 బిలియన్ డాలర్ల మేర తగ్గే ప్రమాదం ఉంది. అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్నా, స్వదేశంలోనే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అక్కడ గ్యాస్ ధరలు గ్యాలన్‌కు 4 డాలర్లు దాటడం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం ట్రంప్ అనాలోచిత ఆర్థిక , యుద్ధ తంత్రానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. యుద్ధం ద్వారా శాంతిని కాక, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు. అన్నింటికంటే మించి, ఈ యుద్ధం మిగిల్చిన ప్రాణ నష్టం వర్ణనాతీతం. ఇరాన్ వైపు సుమారు 6,000 మంది సైనికులతో పాటు వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఒక మానవీయ సంక్షోభానికి దారితీసింది. మరోవైపు, అమెరికా కూడా తన సైనికులను , 17కు పైగా వ్యూహాత్మక స్థావరాలను కోల్పోయి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇరాన్ ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్ వంటి దేశాలు నిరంతరం భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఇది ఒక దేశంపై సాధించిన విజయం కాదు, మానవ నాగరికత ఓటమి అని స్పష్టమవుతోంది. దౌత్యం విఫలమైన చోట అహంకారం రాజ్యమేలితే జరిగే ప్రాణ, ఆస్తి నష్టాలకు ఈ యుద్ధమే సజీవ సాక్ష్యం.
ఇరాన్ .. కొలంబియా కాదు !
మొండివాడు రాజుకన్నా బలవంతుడు అన్న సామెత ప్రస్తుతం ఇరాన్ విషయంలో అక్షరాలా నిజమవుతోంది. అగ్రరాజ్యం అమెరికా ఎన్ని దాడులు చేసినా, ఎంతటి అధునాతన ఆయుధాలు ప్రయోగించినా ఇరాన్ లొంగకపోవడం ట్రంప్ అహంకారాన్ని దెబ్బతీస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణపై అంతర్జాతీయ సమాజంలో ఏమాత్రం నమ్మకం లేదు. ట్రంప్ తన మొండితనాన్ని పక్కన పెట్టి, దౌత్యపరమైన పరిష్కారం వెతకకపోతే, ఈ యుద్ధం కేవలం ఇరాన్‌ను మాత్రమే కాదు, అమెరికా ప్రతిష్టను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా శ్మశానంగా మారుస్తుంది. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే పోరాటం కాదు, అది కోట్లాది మంది సామాన్యుల జీవితాలను చిధ్రం చేసే ఆర్థిక విలయం. యుద్ధం ప్రారంభించడం సులభం.. ముగించడమే కష్టం. ఒక గొప్ప నాయకుడికి యుద్ధాన్ని ఎప్పుడు ప్రారంభించాలో మాత్రమే కాదు, దాన్ని గౌరవప్రదంగా ఎలా ముగించాలో కూడా తెలిసి ఉండాలి. దురదృష్టవశాత్తు, ట్రంప్ ముందున్న అతిపెద్ద వైఫల్యం ఇదే. శాంతిని స్థాపించడం కంటే యుద్ధాన్ని ప్రారంభించడం సులభం, కానీ ఆ విధ్వంసం నుంచి దేశాలను తిరిగి గాడిలో పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. యుద్ధోన్మాదంతో ఇరాన్‌ను బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలనుకోవడం ట్రంప్ వ్యూహాత్మక అజ్ఞానానికి నిదర్శనం. రెండు వారాల కాల్పుల విరమణ కూడా బెదిరింపు పద్దతిలోనే సాగింది. ఇది నిజాయితీతో కూడిన శాంతి ప్రయత్నం కంటే, తదుపరి భారీ దాడికి సిద్ధపడేందుకు దొరికిన విరామంగానే కనిపిస్తోంది. ఒకవైపు ఇరాన్ తన ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతామని అంటూంటే ట్రంప్ తన ఈగోను సంతృప్తి పరుచుకోవడానికి ఏ క్షణమైనా మళ్లీ క్షిపణి దాడులకు ఆదేశాలిచ్చే ప్రమాదకర స్థితి నెలకొంది. ఈ అనిశ్చితి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విశ్వసనీయత లేని కాల్పుల విరమణలు శాంతిని తీసుకురాలేవు, పైగా అవి మరింత పెద్ద విధ్వంసానికి మౌన సాక్ష్యాలుగా మారుతాయి. ఈ పోరాటంలో అమెరికా తన అతిపెద్ద ఆస్తిని అంతర్జాతీయ విశ్వసనీయతను కోల్పోయింది. గతంలో మిత్రదేశాలతో కలిసి నడిచే అగ్రరాజ్యం, నేడు ఒక నమ్మదగని భాగస్వామి గా ముద్ర వేయించుకోవడం విచారకరం. “మొండివాడు రాజుకన్నా బలవంతుడు” అన్న సామెతను నిజం చేస్తూ, ఇరాన్ తన పంతాన్ని వీడకుండా అమెరికాను ఆత్మరక్షణలో పడేసింది. అగ్రరాజ్యపు ఆధిపత్యం ఇప్పుడు కేవలం ఆయుధ బలం మీదనే ఆధారపడి ఉంది తప్ప, నైతిక బలం మీద కాదు. ఇది అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో ఒక కోలుకోలేని దెబ్బ.
చరిత్ర నుంచి ఎవరూ పాఠాలు నేర్చుకోరు!
చరిత్ర నుంచి మనం నేర్చుకునే ఏకైక పాఠం ఏంటంటే.. ఎవరూ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోరని. వియత్నాం నుంచి ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ వరకు అమెరికా చేసిన యుద్ధాలన్నీ ఆ దేశానికి మిగిల్చింది కేవలం ప్రాణ, ఆస్తి నష్టమే. ఆ వైఫల్యాల నుంచి గుణపాఠం తీసుకోవాల్సింది పోయి, నేడు మళ్ళీ వ్యూహరహితంగా ఇరాన్ సంక్షోభంలోకి దూకడం ఆశ్చర్యకరం. ట్రంప్ అనుసరిస్తున్న ఈ మజిల్ పవర్ పాలిటిక్స్ మెరికాను ప్రపంచానికి దూరం చేస్తున్నాయి. యుద్ధాన్ని ఎలా మొదలుపెట్టాలో తెలిసిన నేతలకు, దాన్ని ఎలా ముగించాలో తెలియకపోవడం ఒక విషాదం. ఇది కేవలం పాలకుల మొండితనం వల్ల దేశాలు చెల్లిస్తున్న భారీ మూల్యం. ఈ అసంబద్ధ యుద్ధం వల్ల ఇరాన్ భౌతికంగా చితికిపోయి ఉండవచ్చు, కానీ దాని వల్ల అమెరికా తన ప్రపంచ నాయకత్వ హోదాను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇది కేవలం ఒక రాజకీయ తప్పిదం కాదు, మానవ నాగరికతను దశాబ్దాల వెనక్కి నెట్టేసే ప్రమాద ఘంటిక. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం నిర్మించుకున్న శాంతి నియమాలను అగ్రరాజ్యమే తుంగలో తొక్కడం వల్ల, భవిష్యత్తులో ఏ దేశమూ సురక్షితం కాదనే భావన బలపడుతోంది. అహంకారం , అనాలోచిత నిర్ణయాల మధ్య నలిగిపోతున్న నాగరికతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రపంచ దేశాల మీద ఉంది. లేదంటే, చరిత్రలో ఈ కాలాన్ని అంధకార యుగం గా గుర్తించే ప్రమాదం ఉంది.
ప్రపంచనాగరికతకు ట్రంపే పెనుముప్పు !
నేటి ప్రపంచం ఎనిమిది దశాబ్దాల శాంతి , సహకారంతో నిర్మించుకున్న ఒక సుసంపన్నమైన అద్దాల మేడ. ఈ సున్నితమైన సౌధంలో కూర్చుని డొనాల్డ్ ట్రంప్ తన అనాలోచిత నిర్ణయాలనే రాళ్లను విసురుతుంటే, ఆ అద్దాలు పగిలి రాలుతున్న శబ్దమే నేటి అంతర్జాతీయ సంక్షోభం. మానవ నాగరికత ఆర్థికంగా, సామాజికంగా ఇంతటి పురోగతిని సాధించిందంటే అది కేవలం శాంతి వల్ల మాత్రమే సాధ్యమైంది. అయితే, తన ఈగో ను సంతృప్తి పరచుకోవడానికి ఆ శాంతిని పణంగా పెట్టి యుద్ధాన్ని ఎంచుకోవడం అంటే.. దశాబ్దాల అభివృద్ధిని వదిలేసి రాతి యుగం వైపు పయనించడమే. ట్రంప్ విసిరిన ఈ రాళ్లు సృష్టించే గాయాలు కేవలం ఈ తరానికి మాత్రమే కాదు, రాబోయే అనేక తరాల భవిష్యత్తుపై శాపంగా మిగిలిపోనున్నాయి. నాయకత్వం అంటే తుపాకులు పేల్చడం కాదు, తూటాల అవసరం లేకుండానే దేశాలను ఏకతాటిపైకి నడపడం. కానీ ట్రంప్ తన మూర్ఖపు పంతాలతో దౌత్యానికి స్వస్తి పలికి, ఘర్షణే పరమావధిగా అడుగులు వేస్తున్నారు. ఒక గొప్ప నేతగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉన్నా, తన స్వయంకృత అపరాధాలతో ఆయన ఒక విధ్వంసకారుడిగానే ముద్ర వేయించుకుంటున్నారు. రేపటి చరిత్ర పుటల్లో ట్రంప్ పేరు ఖచ్చితంగా గుర్తుండిపోతుంది, కానీ అది ఒక మార్గదర్శిగా కాదు.. ఒక వ్యవస్థీకృత ప్రపంచాన్ని అస్థిరపరిచిన నెగెటివ్ ఛాయలున్న వ్యక్తిగా మాత్రమే. అహంకారం వీడి దౌత్యం వైపు మళ్లకపోతే, కాలం ఆయనను ఒక గొప్ప పాలకుడిగా కాకుండా, మానవ నాగరికత పురోగతిని అడ్డుకున్న ఒక అడ్డంకిగానే గుర్తిస్తుంది. ట్రంప్ ఇలాంటి గుర్తింపునకు మాత్రమే అర్హుడు.
