తెరాస‌లోకి ఉమా మాధ‌వ‌రెడ్డి.. వ‌యా కాంగ్రెస్‌!

తెలంగాణ టీడీపీలో మిగిలి ఉన్న కొద్దిమంది నాయకులు కూడా ఎవ‌రిదారి వారు చూసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వెళ్లినా పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌నీ, మ‌రింత ప‌టిష్టం చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్న భ‌రోసాను అధినాయ‌క‌త్వం కార్య‌క‌ర్త‌ల్లో నింపే ప్ర‌య‌త్నం చేసింది. కానీ, నాయ‌కుల‌కు మాత్రం భ‌విష్య‌త్తు మీద భ‌రోసా స‌రిపోవ‌డం లేదు! ఇంకా పార్టీలో కొన‌సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఏంట‌నే అభ‌ద్ర‌త ఉన్న‌వారిలో పెరుగుతోంద‌న‌డంలో సందేహం లేదు. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ నాయ‌కురాలు ఎలిమినేటి ఉమా మాధ‌వ రెడ్డి టీడీపీకి దూర‌మౌతున్నారు. పార్టీకి గుడ్ బై చెప్పేసేందుకు దాదాపు సిద్ధ‌మైపోయారు. కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని ఆమె అధికార పార్టీ తెరాస‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఉమా మాధ‌వ రెడ్డి తెరాస‌లోకి రావ‌డం వెన‌క అధికార పార్టీ వ‌ర్గాలే చ‌క్రం తిప్పిన‌ట్టు స‌మాచారం!

నిజానికి, ఆమె పార్టీ మార‌తార‌నే చ‌ర్చ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే, ఆమె తెరాస‌లో చేర‌తారని అనుకోలేదు! కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే ఆమె సిద్ధ‌మ‌య్యారు. ఇదే విష‌యమై ఆ పార్టీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరి టిక్కెట్ కూడా ఖాయ‌మైంది. జిల్లాలోని కీల‌క నేత‌లైన కోమ‌టిరెడ్డి సోద‌రుల‌తో కూడా ఆమె భేటీ అయ్యారు. కుమారుడు సందీప్ రెడ్డితో స‌హా ఆమె త్వ‌ర‌లోనే కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవాల్సి ఉంది. స‌రైన స‌మ‌యం చూసి ఈ లాంఛ‌నం పూర్తి చేసేందుకు టీ. కాంగ్రెస్ నేత‌లు ప్ర‌ణాళిక సిద్ధం చేశార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ, అనూహ్యంగా ఇప్పుడామె తెరాస‌లో చేరుతున్నారు! దీని వెన‌క తెరాస ఆప‌రేష‌న్ ఉంద‌నే చెప్పొచ్చు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతోంద‌న్న వాతావ‌ర‌ణం ఈ మ‌ధ్య మ‌ళ్లీ క‌నిపిస్తోంది. ముఖ్యంగా, రేవంత్ రెడ్డి పార్టీలో చేరాక కొంత ఊపు వచ్చింది. ఆయ‌న‌తోపాటు కొంత‌మంది నేత‌లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవ‌డంతో.. అధికార పార్టీ తెరాస కాస్త జాగ్ర‌త్త‌ప‌డ‌టం ప్రారంభించింది. తెరాస‌లోకి నాయ‌కుల చేరిక‌ను పెంచ‌డంతోపాటు, కాంగ్రెస్ కు వెళ్లే వ‌ల‌స‌ల్ని త‌మ వైపు మ‌ళ్లించుకోవాల‌ని చూస్తోంది!ఇలా కాంగ్రెస్ లో చేరిక‌ల్ని అడ్డుకోవాల‌ని భావిస్తున్నారు. ఆ విధంగానే ఉమా మాధ‌వ‌రెడ్డిని తెరాస‌లోకి చేర్చుకోబోతున్న‌ట్టు స‌మాచారం. తెరాస‌లో ఆమెకు ద‌క్క‌బోతున్న ప్రాధాన్య‌త ఏంట‌నే స్ప‌ష్ట‌త ఇంకా లేదు. అయితే, ఆమెకు ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కుమారుడు సందీప్ తో స‌హా ఆమె త్వ‌ర‌లోనే తెరాస గూటికి చేర‌బోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి సిద్ధ‌మైన ఉమా మాధ‌వ‌రెడ్డిని తెరాస‌లోకి తీసుకునేందుకు ఓ మంత్రి కీల‌క‌పాత్ర పోషించార‌ని స‌మాచారం. మ‌రి, తెరాస అనుస‌రిస్తున్న ఈ వ్యూహాన్ని కాంగ్రెస్ నేత‌లు ఎలా స‌మ‌ర్థంగా అడ్డుకుంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.