భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన వందే మాతరం పాట 150వ వర్షోత్సవం పురస్కారంగా లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చర్చను ప్రారంభిస్తారు. దేశ ఐక్యత కోసం ఈ పాట పోషించిన పాత్రను ప్రస్తావించనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేతలు ప్రియంక గాంధీ వాడ్ర, గౌరవ్ గోగోయి తదితరులు చర్చలో పాల్గొంటారు. రాజ్యసభలో ఈ చర్చ డిసెంబర్ 9న జరిగి, గృహ మంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారు.
బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం 1882లో ఆనందమఠ నవలలో ప్రథమంగా ప్రచురించారు. స్వాతంత్ర్య సమరయోధులకు స్ఫూర్తిగా మారిన ఈ పాట, భారతీయ జాతీయవాదానికి చిహ్నంగా నిలిచింది. ప్రధానమంత్రి మోదీ దేశ సాహస మంత్రం గా చెబుతూ ఉంటారు. చర్చలో ఇదే హైలెట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ పాట అంశంపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. 1937లో పాటలో మొదటి రెండు భాగాలు మాత్రమే స్వీకరించడం వల్ల దేశ విభజనకు మార్గం వేసినట్టు బీజేపీ నాయకులు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ ఈ విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించారు. దేశ విభజనకు మానసికంగా సిద్ధం చేయడానికి ఇలా చేశారని కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ మోదీ పార్లమెంట్ లో ప్రస్తావించే అవకాశం ఉంది.
1937 కాంగ్రెస్ సమావేశంలో వందే మాతరం పై తీవ్ర వివాదాలు తలెత్తాయి. ముస్లిం లీగ్ దీన్ని హిందూ పాటగా వర్గీకరించి వ్యతిరేకించింది. ఫలితంగా, మొదటి రెండు భాగాలు మాత్రమే జాతీయ గీతంగా తీసుకున్నారు. బీజేపీ ఈ నిర్ణయం దేశ విభజనకు దోహదపడిందని వాదిస్తుంటే, కాంగ్రెస్ ఐక్యతా భావాన్ని కాపాడిన చర్యగా చెప్పుకుంటోంది. రవీంద్రనాథ్ ఠాగోర్ సలహాతో మొదటి రెండు శ్లోకాలు మాత్రమే ఆనాడు స్వీకరించారని చెబుతున్నారు. ఇది ముస్లిం లను ఆకర్షించడానికి కాదు.. దేశ ఐక్యత కోసమేనని “అంటున్నారు. ముస్లిం లీగ్ పాటలోని హిందూ సాంస్కృతిక అంశాలకు వ్యతిరేకించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. , సుభాష్ చంద్ర బోస్ వంటి నాయకులు పూర్తి పాటకు మద్దతు ఇచ్చినా పాక్షికంగా కాంగ్రెస్ ప్రచారంలోకి తీసుకు వచ్చింది.
ఇప్పుడు 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆ పాటను గౌరవించుకోవడం మంచిదే. పార్లమెంట్ ఏకాభిప్రాయంతో ఆ గౌరవం ఇవ్వాలి. ఈ పాట ఆధారంగా ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చేసుకుంటే అగౌరవం ఇచ్చినట్లే. చారిత్రక చిహ్నాన్ని రాజకీయ ఆయుధంగా మలచడం ద్వారా బీజేపీ తన సాంస్కృతిక అజెండాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ దీన్ని చరిత్ర వక్రీకరణగా ఎదురుదాడి చేయడం ఖాయం.
