ఈడీ విచారణకు వెళ్లబోతున్న విజయసాయిరెడ్డి.. జగన్ రెడ్డికి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. కోటరీని ఇప్పటికైనా దూరం పెట్టాలన్నట్లుగా ఆయన సందేశం సోషల్ మీడియా ద్వారా ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. వెనిజువెలా అధ్యక్షుడి ఉదాహరణను ప్రస్తావిస్తూ ఆయన పరోక్షంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హెచ్చరిక సంకేతాలు పంపారు. అమ్ముడుపోయిన కోటరీ మధ్య బందీలుగా ఉన్న నాయకులారా.. భవిష్యత్తులో ఏం జరగబోతుందో గుర్తించండి అంటూ ఆయన చేసిన హెచ్చరిక అందర్నీ ఆకర్షిస్తోంది.
లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి మరో మూడు రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకావాల్సి ఉన్న తరుణంలో ఈ ట్వీట్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆయన సిట్ వద్ద అప్రూవర్‌గా మారారన్న ప్రచారం జరుగుతోంది. తన చుట్టూ ఉన్న వ్యవస్థ అమ్ముడుపోతే ఎంతటి శక్తివంతుడైన నాయకుడైనా బందీ కావాల్సిందేనని ఆయన చేసిన విశ్లేషణ, జగన్ చుట్టూ ఉన్న కోటరీ పార్టీని, జగన్‌ను తప్పుదోవ పట్టిస్తోందనే సంకేతాన్ని ఇస్తోంది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం కేవలం కోటరీపై విమర్శ మాత్రమే కాదు, అది జగన్‌కు ఒక గట్టి హెచ్చరికలా కనిపిస్తోంది.
సైన్యం, నిఘా వర్గాలు ఉన్నా వెనిజువెలా అధ్యక్షుడు ఎలాగైతే అరెస్టయ్యారో, అలాగే సరైన వ్యక్తులు చుట్టూ లేకపోతే భవిష్యత్తులో జగన్‌కు కూడా గడ్డు పరిస్థితులు తప్పవని విజయసాయిరెడ్డి హెచ్చరిస్తున్నట్లు అర్థమవుతోంది. విజయసాయిరెడ్డి తన ట్వీట్ ద్వారా అటు దర్యాప్తు సంస్థల విచారణకు సిద్ధమవుతూ .. తాను సంచలన విషయాలు ఈడీకి చెప్పే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినట్లుగా భావించవచ్చు.
