తెలంగాణ పాలనను కెసిఆర్ (మూఢ) నమ్మకాలే నడిపిస్తున్నాయి అంటున్న విజయశాంతి

నమ్మకానికి , మూఢ నమ్మకానికి మధ్య తేడా చాలా సున్నితమైంది. మిగతా అన్ని అంశాలను సరిచూసుకున్న తర్వాత వాటితో పాటే తన నమ్మకాన్ని కూడా జత చేసి పనులు మొదలు పెడితే, అది నమ్మకం అవుతుంది. అలా కాకుండా మిగతా అంశాలన్నింటినీ పక్కనపెట్టి కేవలం కొన్ని నమ్మకాల ని పట్టుకుని వేలాడుతూ ప్రతినిర్ణయాన్ని ఆ నమ్మకాన్ని ఆధారంగానే తీసుకుంటూ ఉంటే అప్పుడు అది మూఢనమ్మకం అవుతుంది. ఇప్పుడు కెసిఆర్ పాలన లో తెలంగాణని ఇటువంటి మూఢనమ్మకాలు నడిపిస్తున్నాయంటూ బాంబు పేల్చారు కాంగ్రెస్ నేత విజయశాంతి.

కెసిఆర్ మొదట్లో సచివాలయాన్ని బైసన్ పోలో గ్రౌండ్ కు తరలించాలని భావించారని, ఆ మేరకు కేంద్రం తో పైరవీలు జరిపి దాన్ని సాధించుకున్నారు కూడా అని, కానీ ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుండే తన వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి అని కేసీఆర్ ఇప్పుడు భావిస్తున్నారని, ఈ కారణంగానే మనసు మార్చుకుని సెక్రటేరియట్ తరలించే నిర్ణయాన్ని మార్చుకున్నారని విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

విజయశాంతి పోస్ట్ చేస్తూ, ” నిన్నటి వరకు సచివాలయ ప్రాంగణాన్ని బైసన్ పోలో గ్రౌండ్ కు తరలిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చారు. తెలంగాణకు సంబంధించిన విభజన సమస్యలు చాలా పెండింగులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బైసన్ గ్రౌండ్ కోసం కెసిఆర్ గారు తెగ పైరవీలు చేశారు. ఎట్టకేలకు కేసీఆర్ గారు చేసే ప్రయత్నం ఫలించింది. ఆయన రెండోసారి సీఎం అయిన వెంటనే కేంద్రం కూడా కెసిఆర్ గారి కోరిక మేరకు టిఆర్ఎస్ ప్రభుత్వానికి బైసన్పోలో గ్రౌండ్ అప్పగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతా సజావుగా జరిగింది అనుకుంటున్న తరుణంలో కేసీఆర్ గారి మైండ్ సెట్ సడన్ గా మారిపోయింది. బైసన్ పోలో గ్రౌండ్ వద్దు. పాత సచివాలయ ప్రాంగణం ముద్దు అని కొత్త పల్లవి అందుకున్నారు. అంతగా కావాలంటే పాత సచివాలయ బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేస్తామని కెసిఆర్ ఇప్పుడు చెప్తున్నారు. కెసిఆర్ గారి మైండ్ సెట్ అకస్మాత్తుగా మారడం వెనుక అసలు రహస్యం ఒకటి ఉందని ఇటీవల కలిసిన టిఆర్ఎస్ నేతలు కొందరు నాతో చెప్పిన మాటలు విని ఆశ్చర్యం కలిగింది. బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయాన్ని నిర్మించడానికి తలపెట్టి – శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న వెంటనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కొత్త సచివాలయంలో కి వెళ్లిన వెంటనే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ కలలు కన్నారని గులాబీ నేతలు నాతో చెప్పారు. తీరా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి చావు తప్పి కన్ను లొట్టపోయిన విధంగా కెసిఆర్ గారి పరిస్థితి మారింది. దీంతో టిఆర్ఎస్ ఉనికి రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది అనే ఆలోచన కేసిఆర్ లో మొదలయ్యింది. బైసన్ పోలో గ్రౌండ్ లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టిన రోజు నుంచి తన వ్యూహాలన్నీ బెడిసి కొడుతున్నాయి అని కెసిఆర్ లో ఆందోళన మొదలైనట్లు టిఆర్ ఎస్ నేతలు చెబుతున్నారు. దాంతో పాత సచివాలయ ప్రాంగణం లోనే పునర్నిర్మాణం చేసి – డిజైన్ మార్చాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వింతలు – విడ్డూరాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందోనని తెలంగాణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాన్ని మార్చే మాటేమోగాని, కెసిఆర్ గారి మైండ్ సెట్ మారకపోతే సీఎం పదవి నుంచి ఆయనను మార్చడానికి తెలంగాణ ప్రజలు వెనుకాడరు అనే విషయాన్ని టిఆర్ఎస్ అధిష్టానం గుర్తించాలి” అని వ్రాసుకొచ్చారు.

మొత్తానికి రాములమ్మ చెప్పిన విషయాల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, కెసిఆర్ పాలన లోని చాలా నిర్ణయాలు ఆయన మూఢనమ్మకాల మీద ఆధారపడి జరుగుతున్నాయన్న భావన మాత్రం ప్రజల్లో గట్టిగానే ఉంది. మరి టిఆర్ఎస్ నేతలు విజయశాంతి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com