రాహుల్‌ గాంధీపై స్మృతి ఇరానీ అస్త్రం..!

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పూర్తిగా పట్టు కోల్పోయినా.. రెండు అంటే..రెండు నియోజకవర్గాల్లో మాత్రం.. ఎప్పుడూ గెలుస్తూ వస్తోంది. అది గాంధీ కుటుంబానికి ఉన్న పలుకుబడి కావొచ్చు.. మిత్రపక్షాల సహకారం కావొచ్చు. అమేధీలో రాహుల్ గాంధీ, రాయ్ బరేలీలో సోనియా గాంధీ మాత్రం గెలుస్తూ వస్తున్నారు. అయితే వారి మెజార్టీలు ఏమీ.. బంపర్‌గా ఉండవు. కానీ గెలుపునకు మాత్రం ఢోకా ఉండదు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఈ సారి రాహుల్‌ గాంధీని ఓడించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే.. చాలా రోజుల కిందటే.. స్మృతి ఇరానీకి అమేధీ బాధ్యతలు అప్పగించారు. కేంద్రమంత్రిగా ఉన్నా.. ఆమె… చాలా రోజుల కిందటే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ఆమె అమేధీలో జోరు పెంచుతున్నారు.

2014 ఎన్నికల్లోనూ స్మృతి ఇరానీ.. రాహుల్‌పై పోటీ చేసి ఓడిపోయారు. కానీ అప్పుడు చివరి క్షణాల్లో ఆమెకు టిక్కెట్ ఖరారయింది. ఈ సారి ముందు నుంచే గ్రీన్ సిగ్నల్ ఉండటంతో.. ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం అండదండలు అందిస్తోంది. ఇక ఎంపీగా.. కేంద్రమంత్రిగా తన స్థాయిలో నియోజకవర్గల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా .. డిజిటల్ ఇండియాలో భాగంగా.. ఓ గ్రామాన్ని దత్త తీసుకుని పూర్తిగా డిజిటల్ విలేజ్‌గా మార్చారు. గ్రామస్తులందరికీ.. ఉచిత వైఫై అందిస్తున్నారు. నిజానికి దీని కంటే ముందుగా ఆమె.. అమేధీలో ఆమె అనేక కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో చాలా వివాదాస్పదమయ్యాయి కూడా.

త్వరలో పది వేల ఆవులను పంపిణీ చేయడానికి…సన్నాహాలు చేస్తున్నారు. ఇవేమీ ఆమె సొంత సొమ్ము కాదు. నర్మదా ఫెర్టిలైజర్స్ అనే సంస్థ … కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ పథకం కింద…ఈ ఆవులను ఇస్తోంది. నర్మదా ఫర్టిలైజర్స్ సంస్థకు ..ఉత్తరప్రదేశ్ కు కానీ.. అమేథీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఆ సంస్థ గుజరాత్ కు చెందినది. ఆ సంస్థలో 42శాతం వాటా గుజరాత్ ప్రభుత్వానికి ఉంది. అంటే ఓ రకంగా ప్రభుత్వ సంస్థ. సీఎస్ఆర్ నిధులు ఏమైనా ఖర్చు పెట్టాలంటే.. గుజరాత్ లో పెట్టుకోవచ్చు.. కానీ అవుల రూపంలో అమేధీకి తరలిస్తున్నారు. అంటే.. రాహుల్ గాంధీని టార్గెట్ గా చేసుకుని.. అమేధీలో ఓట్ల కొనుగోలను.. బీజేపీ తరపున స్మృతి ఇరానీ ప్రారంభించేశారన్నమాట. ఇంకా నేరుగా ఓటర్లను లబ్ది చేకూర్చే పథకాలను పెద్ద ఎత్తున అమేధీ ప్రజలకు అందిస్తున్నారు. అంటే పక్కా ప్లాన్‌తోఉన్నట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]