పశ్చిమ ఆసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతలు భారత రియల్ ఎస్టేట్ రంగానికి ఊహించని విధంగా కొత్త ఊపిరి పోస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న అనిశ్చితి వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గాల కోసం అన్వేషిస్తుండగా, భారతదేశంలోని ప్రీమియం రెసిడెన్షియల్ మార్కెట్ వారికి అత్యంత ఆకర్షణీయమైన వేదికగా మారుతోంది. అంతే కాకుండా భారత్ నుంచి దుబాయ్ లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టేవారు కూడా పునరాలోచించే అవకాశం ఉంది.
కొన్నేళ్లుగా భారతీయులు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంటూ వస్తున్నారు. అయితే తాజా ఉద్రిక్తతల వల్ల అక్కడి మార్కెట్లో కొత్త పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. అక్కడి ప్రాపర్టీల కంటే భారతీయ ప్రీమియం ,లగ్జరీ గృహాల మార్కెట్ ఇప్పుడు లాభదాయకమైన ఎంపికగా కనిపిస్తోంది. ఇప్పటికే ఉన్న అనిశ్చితి కారణంగా ప్రవాస భారతీయులు సైతం తమ పొదుపు మొత్తాలను విదేశీ బ్యాంకుల్లో ఉంచడం కంటే, వేగంగా వృద్ధి చెందుతున్న స్వదేశీ రియల్ ఎస్టేట్ ఆస్తులలో ఇన్వెస్ట్ చేయడం మేలని భావిస్తారని అంచనా వేస్తున్నారు.
భారతదేశంలో ఆర్థిక స్థిరత్వం ఉండటం, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం వల్ల ఇక్కడి లగ్జరీ అపార్ట్మెంట్లు , విల్లాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా అధిక ఆదాయ వర్గాల వారు యుద్ధ భయాలతో తమ పోర్ట్‌ఫోలియోను దేశీయ భూములను, వాణిజ్య సముదాయాలను ఎంచుకుంటున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, రూపాయి విలువ ఒడిదుడుకులకు గురైతే ఎన్ఆర్ఐలకు భారతీయ మార్కెట్ మరింత చౌకగా మారుతుంది, ఇది అంతిమంగా స్వదేశీ అమ్మకాలకు భారీగా కలిసొచ్చే అంశం.
యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొంత మందగించినా, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతుండటం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతోంది. దేశీ గడ్డపై రిస్క్ తీసుకోవడం కంటే స్వదేశంలో స్థిరమైన రాబడిని ఇచ్చే రియల్ ఎస్టేట్ ఆస్తుల వైపు మళ్లడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా మారుతోంది. ఈ పరిణామాలు రాబోయే త్రైమాసికాల్లో భారత రియల్ ఎస్టేట్ రంగంలో రికార్డు స్థాయి లావాదేవీలకు దారితీస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
