మహేష్ బాబు అభిమానులకు ఇదో పండగ రోజు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్లింప్స్ ఈరోజు రాబోతోంది. అందుకుగానూ రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక కానుంది. ఈరోజు ఆర్.ఎఫ్.సీలో ఓ భారీ ఈవెంట్ జరగబోతోంది. ఇండియాలోనే ఇప్పటి వరకూ ఇలాంటి ఈవెంట్ జరగలేదు. ఇక మీదట జరుగుతుందో లేదో తెలీదు కూడా. వేలాదిమంది అభిమానులు ఇప్పటికే ఆర్.ఎఫ్.సీ దారి పట్టారు. ఈ గ్లింప్స్ కోసం ఓ భారీ తెరని ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేశారు. 100 అడుగుల ఎత్తులో ఉండే స్క్రీన్ అది. ఇప్పటి వరకూ ఇలాంటి స్క్రీన్ ఎవరూ ఏర్పాటు చేయలేదు. ఈ గ్లింప్స్ లైవ్ స్ట్రీమింగ్ హక్కుల్ని జియో హాట్ స్టార్ సొంతం చేసుకొంది. ఓ సినిమా ఈవెంట్ హక్కుల్ని ఓటీటీ కి అమ్మడం కూడా ఇదే తొలిసారి. ఈ ఈవెంట్ మాత్రమే కాదు.. భవిష్యత్తులో ఈ సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్ చేసినా అది హాట్ స్టార్ లోనే చూడగలం.
ఈ ఈవెంట్ కోసం రాజమౌళి అండ్ టీమ్ నెల రోజుల నుంచీ కసరత్తులు మొదలెట్టింది. ఈవెంట్ డిజైనింగ్, ఎగ్జిక్యూషన్ బాధ్యతల్నీ రాజమౌళి స్వయంగా చూసుకొన్నారు. గ్లింప్స్ తో పాటుగా శ్రుతిహాసన్ లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఈవెంట్ లో ఉండబోతోంది. అంతేకాదు.. కొన్ని ఎక్స్‌క్లూజీవ్ మేకింగ్ వీడియోస్ కూడా చూపించబోతున్నారని సమాచారం. మహేష్ ఎంట్రీ కోసం కూడా ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తున్నారని టాక్. వేదికపై కేవలం చిత్రబృందం మాత్రమే ఉండబోతోంది. అతిథులెవ్వరూ లేరు.
ఇంతకీ రాజమౌళి ఈసారి గ్లింప్స్ లో ఏం చూపించబోతున్నాడు అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. రాజమౌళి ఎప్పుడైనా సరే.. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతోనే వస్తాడు. ఈసారి గ్లింప్స్ లో సరికొత్త విజువల్స్ కనిపించబోతున్నాయని, కథని చూచాయిగా చెప్పబోతున్నాడని.. మహేష్, ప్రియాంక ఈ మూడు పాత్రల్నీ ఈ గ్లింప్స్ లో చూపించబోతురని, రామాయాణానికి సంబంధించిన కొన్ని రిఫరెన్సులూ కనిపించే ఛాన్స్ వుందని సమాచారం. ఓ సినిమాకు సంబంధింయిన గ్లింప్స్ కోసం ఇంత భారీ ఎత్తున ఓ ఈవెంట్ చేస్తున్నారంటే ఆ గ్లింప్స్ ఏ రేంజ్లో ఉండాలి? గ్లింప్స్ కోసం ఓ ఈవెంట్ చేస్తూ దాన్ని ఓటీటీకి అమ్మారంటే… ఆ గ్లింప్స్ లో ఎంత దమ్ముండాలి? నిజంగానే రాజమౌళి ఈసారి ఏం చూపించబోతున్నాడో అని తెలుగు సినీ అభిమానులే కాదు.. ఇండియా మొత్తం కళ్లప్పగించి చూస్తోంది. మరి రాజమౌళి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో?


