నెయ్యి కల్తీ చేసిన వారిని జగన్ ఎందుకు సమర్థిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో నిలదీశారు. కల్తీ నెయ్యిపై జరిగిన చర్చలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేశారని తాము ఎవర్నీ వెలేత్తి చూపించలేదని .. కల్తీ జరిగిందని సీబీఐ సిట్ రిపోర్టు ఇస్తే ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. గత టీటీడీ బోర్డు తప్పు చేస్తే..జగన్ ఎందుకు ససమర్థిస్తున్నారో చెప్పాలన్నారు
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో కలిసిన కల్తీ నెయ్యిని వాడటం అనేది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కేవలం ఒక కల్తీ వ్యవహారం మాత్రమే కాదని, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. భక్తుల విశ్వాసాలతో ఆడుకోవడం క్షమించరాని నేరమని ఆయన అసెంబ్లీ సాక్షిగా ధ్వజమెత్తారు. కేంద్ర సంస్థ ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారాలను ప్రస్తావిస్తూ, లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎన్డీడీబీ వంటి నిష్పాక్షిక సంస్థ ఇచ్చిన నివేదికను కూడా గత పాలకులు తప్పుదోవ పట్టించాలని చూడటం వారి నైతిక పతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. దేవుడి ప్రసాదాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం, అవినీతి కోసం వాడుకున్నారని ఆరోపించారు.
హిందువులు కులాల వారీగా విడిపోయారని..అదే వైసీపీ ధైర్యమన్నారు. గత ప్రభుత్వం నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టులను తమకు నచ్చిన వారికి అప్పగించిందని, తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేస్తామన్న కంపెనీల నాణ్యతను పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. కేవలం రూ. 233 కోట్ల మేర అవినీతికి పాల్పడేందుకు గాను 20 కోట్ల లడ్డూలను అపవిత్రం చేశారని గణాంకాలతో సహా వివరించారు. గోవు పాలు లేకుండానే నెయ్యిని సృష్టించడం కేవలం గత ప్రభుత్వ నాయకులకే సాధ్యమైందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ ఘటన కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా హిందూ ఆలయాల రక్షణకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. భవిష్యత్తులో ఇలాంటి అపవిత్ర చర్యలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని, దోషులను చట్టం ముందు నిలబెట్టే వరకు వదిలే ప్రసక్తే లేదని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ పోరాటం కేవలం రాజకీయాల కోసం కాదని, ధర్మ పరిరక్షణ కోసమని ఆయన ఉద్ఘాటించారు.
