పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అవన్నీ బయటకు తెలియవు. కొన్ని చర్యల ద్వారా యుద్ధ సన్నాహాలు అని మాత్రం క్లారిటీ వచ్చింది. మన దేశ ప్రజల కన్నా ముందుగా పాకిస్తాన్ కు డౌట్ వచ్చింది. ఇండియా దాడిచేస్తుందన్న ఉద్దేశంతో… దాడి తర్వాత రోజు నుంచే తమ సేనల సెలవులను రద్దు చేసి.. తుప్పుపట్టిన యుద్ధ విమానాలకు ఆయిల్ రాసుకుంటూ రెడీ అయింది. తాము రెడీ నే అని ప్రకటన చేసింది. తమ వద్ద అసలు ఉన్నాయో లేవో తెలియని అణుబాంబులు. వేస్తామని అక్కడి మంత్రులు చేసిన ప్రకటనలు నవ్వుల పాలయ్యాయి.
ఉగ్రవాదులంటే…తమనే అనుకుంటున్న పాకిస్తాన్
పాకిస్తాన్ చర్యలు, అక్కడి నేతల ప్రకటనలతోనే ఆ దేశంలో ఎంతగా కంపించిపోతుందో అర్థం అయిపోతుంది. అష్టదిగ్బంధనం చేసేశారని వారికి అర్థమయ్యే కంట్రోల్ తప్పిపోతున్నారు. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లుగా ఎటు వైపు నుంచి వచ్చి దాడులు చేస్తారోనని కనిపెట్టుకుని ఉండటానికి కష్టాలు పడుతోంది. అయితే భారత్ ఇప్పటి వరకూ పాకిస్తాన్ పై దాడులు చేస్తామని చెప్పలేదు. కనీసం అలాంటి ప్రకటన చేయలేదు. ఉగ్రవాదుల్ని మాత్రం వదిలి పెట్టబోమని చెబుతోంది. వారు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్నా..పాకిస్తాన్ లో ఉన్నా హతం చేయడం ఖాయమని అంటోంది.
అదే విషయాన్ని ప్రపంచం ముందు పెడుతున్న భారత్
ఉగ్రవాదుల్ని అంతం చేస్తామని భారత్ ప్రకటనను పాకిస్తాన్ తనకు అన్వయించుకుంటోంది. అంటే తామే ఉగ్రవాదులమని స్వయంగా ఒప్పుకున్నట్లు అవుతోంది. ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ ఉంది కాబట్టే ఇంత టెన్షన్ పడుతోందని ప్రపంచానికి అర్థం అవుతోంది. భారత్ కు కావాల్సింది కూడా ఇదే. నిజం ఏమిటో ప్రపంచం ముందు పెట్టాలని అనుకుంటోంది. వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్జాతీయ వేదికలపై సాక్ష్యాలను పెడుతోంది. బయట నుంచి సాయం లేకపోతే ఆకలితో అలమటించేపోయే పాకిస్తాన్ కు రూపాయి అందకుండా చేస్తోంది.
లాడెన్ లా సయీద్ ను అంతం చేసే ప్లాన్ ?
భారత్ , అమెరికా తో పాటు మరో పది అగ్రదేశాలు ఉగ్రవాదిగా ప్రకటించిన హాఫిజ్ సయీద్ ను అంతం చేస్తే.. ఉగ్రవాద మూలాలు చాలా వరకూ పెకిలించినట్లుగానే భావిస్తున్నారు. అమెరికాతో కలిసి లాడెన్ తరహాలో సయీద్ ను అంతం చేయాలన్న ఆలోచనలో భారత్ ఉందని పాకిస్తాన్ అనుమానిస్తోంది. అందుకే సయీద్ ను కాపాడటానికి చేయాల్సినవన్నీ చేస్తోంది. అధికారికంగా ఆయన జైల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు కానీ.. పాకిస్తాన్ కు వీఐపీగా ఉన్నారు. ఆయనను అంతం చేస్తారని అది తమపై యుద్ధం చేయడమేనని పాకిస్తాన్ అనుకుంటోంది.