మాజీ మంత్రిని రెండున్నర నెలల నుంచి జైల్లో పెట్టారని జగన్ రెడ్డి వాపోయారు. చిన్న చిన్న కేసులు పెట్టారని అన్నారు. తమ పార్టీ నేతల్ని ఎలా అరెస్టు చేశారో చెప్పుకొస్తున్నారు. వంశీ దగ్గర నుంచి చాలా మంది పేర్లు చెప్పారు. అయితే ఇలా అరెస్టు అవుతున్న వారిలో ఒక్కరిపైనైనా తప్పుడు కేసులు పెట్టారని కానీ.. అరెస్టు చేయడం రాజకీయ కక్ష అని కానీ ప్రజలు అనుకోవడం లేదు. ఎలాంటి స్పందనా లేదు. కనీసం సానుభూతి వస్తుందని అనుకున్నారు. అది కూడా రావడం లేదు. ఎందుకిలా ?
జైలుకెళ్తున్న వారిపై కనీసం జాలి పడకుండా చేస్తున్న జగన్
రాజకీయాలు ఆలోచనతో చేయాలి కానీ ఆవేశంతో కాదు. జగన్ రెడ్డి మంత్రుల ఇళ్లపైకి వెళ్లి హత్యలు చేస్తామని నెల్లూరులో నిలబడి హెచ్చరించారు. ఇలాంటి మైండ్ సెట్ తోనే పాలన చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి.. ప్రతిపక్ష నేత ఇళ్లు, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయించారు. జగన్ మూర్ఖత్వానికి బాధితుడు కాని టీడీపీ నేత లేరంటే ఆశ్చర్యం లేదు. అలాంటి పరిపాలన సాగించారు. ఆ అరాచకం భరించలేకనే ప్రజలు గట్టిగా దెబ్బకొట్టారు. ఇప్పుడు అరాచకాలు చేసిన వాళ్లంతా జైలు పాలవుతున్నారు.
ఇది తక్కువే అని ప్రజలు అనుకునేలా చేస్తున్న వైనం
తాము తప్పు చేయలేదని తమను వేధిస్తున్నారని చెప్పుకోవాలని వైసీపీ నేతలనుకుంటున్నారు. కానీ అరెస్టు అయిన వారెవర్నీ బలవంతంగా అరెస్టు చేయలేదు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి .. బెయిల్ లభించకపోవడంతోనే తప్పనిసరిగా అరెస్టు అవుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు అక్రమ అరెస్టులు అని అనుకోగలరా?. ఎలాగైనా ప్రజల్లో సానుభూతి వస్తుందని ఆశించేవారు ఉంటారు. కానీ అది కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేసి.. అది చేస్తాం.. ఇది చేస్తామని హెచ్చరిస్తున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంటున్న వారి డైలాగుల్ని విని ప్రజలు కూడా వీళ్లకు ఇంత కంటే ఎక్కువ జరగాలని శాపనార్థాలు పెడుతున్నారు.
జగన్ తవ్వుతున్న గొయ్యి ఎలాంటిదో నేతలకు అర్థం కావడం లేదా ?
జగన్ రెడ్డి అవినీతికి, వికృత మానసిక ఆనందానికి బలయ్యేవారే ఎక్కువగా ఉన్నారు. స్వయంగా తాము తప్పులు చేసి జైలుకెళ్లిన వాళ్లు ఎవరూ లేరు. వంశీ అయినా.. రేపు నరకం చూడబోతున్న కొడాలి నాని అయినా.. ఇప్పటికే జైలు పాలయిన.. పోసాని అయినా.. కాకాణి అయినా.. ఎవరైనా జగన్ రెడ్డి కోసం చేసిన పనుల వల్లనే అనుభవించారు. ఇప్పుడు వారెవరిపై కుటుంబసభ్యుల్లో అయినా సానుభూతి ఉండే అవకాశం లేదు. ఇదంతా జగన్ నిర్వాకమే. ఇప్పటికైనా తెలుసుకుంటే… భవిష్యత్ ను అయినా కాస్త గౌరవంగా ఉంచుకుంటారు. లేకపోతే .. ప్రజలు కూడా పాపం అనలేని దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటారు.