వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వారం కోటాలో రెండున్నర గంటల ప్రెస్మీట్ వీడియోను టెలికాస్ట్ చేశారు. అది లైవ్ అని నమ్మించడానికి ఎప్పుడూ లేని విధంగా ఆయన ముందు చాలా చానళ్ల మైకులు పెట్టారు. ఈ వారం టాపిక్ ఏమిటంటే బడ్జెట్ పై విశ్లేషణ. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను ప్రతిపక్ష నేత కాబట్టి చీల్చి చెండాడారు. ఆయనకు మైనింగ్ అంటే ఇష్టం. అందుకే ఈ సారి డేటాను మైనింగ్ చేయించుకొచ్చారు. ఆ డేటా మైనింగ్ గ్రాఫులు తయారు చేసిన వారికైనా అర్థమవుతాయో లేదో కానీ.. వాటన్నింటిని చూపించి.. ఆ మ్యాపుల కింద స్క్రిప్ట్ రైటర్లు ఏం రాసిచ్చారో అది చదివేశారు.
ఇదంతా కొద్ది రోజుల కిందట జీఎస్డీపీ గురించి ఆయన చేసిన ట్వీట్ లో ఉన్నదే. ఆర్బీఐ, కాగ్ డేటాను ఆయన చెప్పరు. ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని తీసుకుని శాతాల్లో ఏది తక్కువగా కనిపిస్తే దాన్నే తీసుకొచ్చి చెబుతారు. దీంతో అసలు మధ్యలో లింకులు లేకుండా.. కనిపించే ఈ డేటా ఎవరికీ అర్థం కాదు. అయినా తాను చెప్పాలనుకున్నది చెప్పి.. ఎప్పట్లానే చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. ప్రతి అంశంలోనూ చంద్రబాబు మోసం చేశారని చెప్పుకొచ్చారు. పెన్షన్లు తొలగిస్తారని.. పథకాలు అమలు చేయడం లేదని ఫీలయ్యారు. అంతగా అయితే ఆ తీసేసిన పెన్షనర్లతో కలిసి రోడ్డెక్కవచ్చు కదా అనే డౌట్ అందరికీ రావొచ్చు. నిజంగా తీసేసి ఉంటే ఆ పని చేసేవారేమో ?. ఇక అప్పుల గురించీ బాధపడ్డారు. తన హయాంలో చేసిన అప్పులు ఎక్కువ చెబుతున్నారని ఫీలయ్యారు. చంద్రబాబు బీభత్సంగా అప్పులు చేస్తున్నారని కూడా చెప్పారు.
అదే సమయంలో లోకేష్ పర్యటనలపైనా ఆయన కుళ్లుకున్నట్లుగా ఉన్నారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ప్రైవేటు విమానం వేసుకుని కొలంబో వెళ్లాలా..? టీవీలో కనిపించదా అని ప్రశ్నించేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లు విమానం, హెలికాప్టర్లలో జల్సాగా గాల్లో తిరుగుతున్నారని.. రాత్రి కొలంబంలో మ్యాచ్ చూసి ఉదయానికి విజయవాడకు వస్తారు, మళ్లీ సాయంత్రానికి ఢిల్లీ వెళ్తారు..బాధ్యతాయుతంగా ఉండే నేతలు ఎవరైనా ఇలా జల్సాలు చేసిన సందర్భాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు. జగన్ మాటలు విని వైసీపీ నేతలు కూడా ఉలిక్కి పడ్డారు. ఎందకంటే జగన్ రెడ్డి జల్సాల గురించి అందరికీ తెలుసు కాబట్టి.
జగన్ రెడ్డికి ఇప్పుడు ఆయన సలహాదారులు ప్రెస్మీట్లు పెట్టించి ఇలా రెండు మూడు గంటలు చూసి చదివించడానికి ఎందుకంత ప్రయాసపడుతున్నారో కానీ.. పార్టీ ఆఫీసుల్లో పెట్టే సమావేశాల్లో..రాజకీయ ఆరోపణలు చేసుకుంటే సరిపోతుంది. ఇలా సబ్జెక్ట్ మాట్లాడాలనుకుంటే.. ఎవరికీ ఎక్కదు.
