ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. తక్కువ ఓటు బ్యాంకు, నామమాత్రపు ప్రజాబలం ఉన్నప్పటికీ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరంతరం జనంలో ఉంటూ ఉనికిని చాటుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఉపాధి హామీ విధానం పేదల పొట్ట కొట్టేలా ఉందంటూ ఆమె చేస్తున్న ఉపాధి హామీ రక్షణ యాత్ర జిల్లాల్లో చర్చకు దారితీస్తోంది. అనంతపురంలోని బండ్లపల్లి నుంచి ప్రారంభమైన ఆమె పర్యటనలు, ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై ఆమె చేస్తున్న పోరాటం, క్షేత్రస్థాయిలో ఆమె పట్టుదలను ప్రతిబింబిస్తున్నాయి.
పోరాటంలో షర్మిల దూకుడు.. అసెంబ్లీకి జగన్ దూరం!
షర్మిల ఒకవైపు ప్రజా సమస్యలపై గొంతెత్తుతుంటే, మరోవైపు 40 శాతం ఓటు బ్యాంకు ఉందని చెప్పుకునే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం జనంలోకి రావడానికి వెనకాడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా లేదన్న సాకుతో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించడం, ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించే అవకాశాన్ని వదులుకోవడం ఆ పార్టీ శ్రేణుల్లోనే అసహనాన్ని పెంచుతోంది. అసెంబ్లీలో గళం విప్పాల్సింది పోయి, కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కావడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ పడిపోతోందనే ఆందోళన నెలకొంది.
జగన్‌కు బీజేపీ భయం
జగన్ మౌనం వెనుక మరో కోణం కూడా వినిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయోనన్న భయంతోనే ఆయన సైలెంట్‌గా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని షర్మిల చేస్తున్న విమర్శలు సామాన్య జనంలోకి వెళ్తున్నాయి. ఉపాధి హామీ వంటి సున్నితమైన అంశంపై జగన్ స్పందించకపోవడం, ఆ ఖాళీని షర్మిల భర్తీ చేస్తూండటం మార్పును సూచిస్తోంది.
జగన్ కంటే షర్మిలే బెటర్ అనే భావన మొదలైతే?
ఇలాగే మరో ఏడాది పాటు జగన్ జనానికి దూరంగా ఉండి, షర్మిల నిరంతరం పోరాటాలు సాగిస్తే.. వైసీపీ అభిమానుల్లో సైతం జగన్ కంటే షర్మిలే బెటర్ అనే అభిప్రాయం బలపడే అవకాశం ఉంది. ఒకసారి అభిమానులు తమ నాయకత్వాన్ని మార్చుకోవాలని భావిస్తే, అది ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది అవుతుంది. ఆ తర్వాత షర్మిల చేసే పొలిటికల్ మ్యాజిక్ వైసీపీ ఉనికినే ప్రశ్నార్థకం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
