వైసీపీలో న్యాయసాయం పొందాలంటే హోదాలు ఉండాలి. ఎవరికైనా జైలుకు పంపాలనుకుంటే.. వాళ్లకు లాయర్ గా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపుతారు. వాళ్లు వెళ్లకూడదు అనుకుంటే నిరంజన్ రెడ్డినో.. నాగార్జున రెడ్డికో డ్యూటీ ఇస్తారు. మిథున్‌రెడ్డి జైలుకు వెళ్లకుండా చూడాలని చాలా గట్టిగానే ప్రయత్నించారు. అందుకే పొన్నవోలును కోర్టు వైపు రానివ్వలేదు. నాగార్జున రెడ్డిని రంగంలోకి దింపారు. పొన్నవోలు వస్తాడేమోనని చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఉగ్గబట్టుకుని ఉన్నారు. ఆయన రాకపోయే సరికి కోర్టు వద్ద ఉన్న కార్యకర్తలు హమ్మయ్య అనుకున్నారు.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి అసలు లాయర్ ఎలా అయ్యాడో .. ఆయనలో జగన్ ఏం చూసి ప్రోత్సహిస్తున్నాడో వైసీపీ కార్యకర్తలకూ అర్థం కాదు. లాయర్ అంటే చట్టంలో ఉన్న లా పాయింట్లతో వాదించాలి. కానీ పొన్నవోలు రాజకీయ నాయకుడి వాదనలు వినిపిస్తారు. జడ్జిలను బెదిరిస్తారు. ఎన్నో సార్లు ఆయనకు న్యాయమూర్తుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. అలా బెదిరిస్తే.. పనులు అవుతాయని.. అదే వాదన అని ఆయన అనుకుంటారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు సిద్ధార్థ లూథ్రా వాదనకు ఆయన పోటీగా వాదనలు వినిపించారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన రెచ్చిపోయిన వైనం అందరికీ గుర్తుండి ఉంటుంది.
దేశమంతా తిరిగి ప్రెస్మీట్లు పెట్టారు. ప్రతీ చోటా జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అల్లరి పాలయ్యారు. కేసులు పెడితే ఎక్కడైనా న్యాయస్థానాల్లో తేల్చాలి కానీ.. ఇలా దేశమంతా తిరిగి ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందో చెప్పలేరు. ఇలాంటి పొన్నవోలును.. పోసాని నుంచి వంశీ వరకూ అందరికీ లాయర్ గా పంపించారు. అందరూ రిమాండ్ కు వెళ్లి ఇప్పటికో బయటకు వచ్చారు.