వైసీపీ డీఎస్సీపై ఎందుకు రచ్చ చేస్తోంది. దీనికి ఒకటే ఆన్సర్లు కనిపిస్తోంది. అదే డైవర్షన్ గేమ్. రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తర్వాత నిరుద్యోగుల కలలను సాకారం చేస్తూ, ఎలాంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా పూర్తయిన మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్పై చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. డీఎస్సీ ప్రక్రియ పూర్తయి, దాదాపు 16 వేల మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరి ఏడాది గడుస్తున్న తరుణంలో.. ఇప్పుడు హఠాత్తుగా వైసీపీకి ఇందులో లోపాలు కనిపించడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందనేది స్పష్టమవుతోంది. ఇది కేవలం నిరుద్యోగులపై ప్రేమతో చేస్తున్న విమర్శలు కాదు. ఇటీవల కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ముసురుకుంటున్న ఘోరమైన ఆర్థిక, వ్యక్తిగత స్కామ్‌ల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న పక్కా డైవర్షన్ గేమ్ .
లీకులకు తావులేకుండా.. సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం రికార్డు రిక్రూట్మెంట్!
ఇటీవలి కాలంలో భారతదేశంలో ఒక ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ ఎలాంటి కోర్టు స్టేలు, పేపర్ లీకేజీలు లేకుండా అనుకున్న సమయానికి పూర్తి కావడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటిది ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మెగా డీఎస్సీని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని విజయవంతంగా నిర్వహించి చూపించారు. పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో, ఎక్కడా లీకులకు ఛాన్స్ లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగింది. అంతేకాకుండా, రిజర్వేషన్ల అమలులో గతంలో వచ్చే చట్టపరమైన చిక్కులను అధిగమించడానికి.. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం హరిజాంటల్ పద్ధతిలో ఒక్క లీగల్ లూప్‌హోల్ కూడా లేకుండా రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేశారు. ప్రతి దశలోనూ ఈ నోటిఫికేషన్‌ను అడ్డుకోవడానికి, అడ్డగోలు పిటిషన్లతో కోర్టుల్లో నిలిపివేయడానికి వైసీపీ నేతలు శతవిధాలా ప్రయత్నించి వందల పిటిషన్లు వేసినప్పటికీ, వాటన్నింటినీ అధిగమించి కూటమి ప్రభుత్వం 16 వేల మందికి నియామక పత్రాలు అందించింది.
ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా ఆగని తప్పుడు ప్రచారం.. ఎందుకు?
వైసీపీ సామాజిక మాధ్యమాల్లో, వారి అనుకూల మీడియాలో డీఎస్సీపై లేవనెత్తిన ప్రతి చిన్న అంశానికి విద్యాశాఖ అధికారిక సమాచారంతో, పక్కా డేటాతో సహా క్లియర్ కట్ సమాధానాలు ఇచ్చింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగలేదని సాంకేతిక ఆధారాలతో నిరూపించినప్పటికీ, ప్రతిపక్షం మాత్రం అదే పాత పల్లవిని అందుకుంటూ విషప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడే వైసీపీ అసలు ప్లాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని తెలిసినా, ప్రజల్లో ఒక రకమైన గందరగోళాన్ని సృష్టించి, నిరంతరం ఏదో ఒక వివాదాన్ని సజీవంగా ఉంచడమే వారి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజం కాకపోయినా.. అసలైన సమస్యల నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ అవుతుందనేది జగన్ రెడ్డి మార్క్ పొలిటికల్ స్ట్రాటజీ.
వైఎస్ కుటుంబ రక్త చరిత్ర పై జెన్-జీ లో పెరిగిన చర్చ!
వైసీపీ ఈ స్థాయిలో డీఎస్సీపై పడటానికి గల తక్షణ కారణాలను పరిశీలిస్తే.. జగన్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తన వంశ చరిత్రను, బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడమే. నిజానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా జగన్ రెడ్డి అనుకున్న మైలేజ్ రాకపోగా.. నేటి ఆధునిక తరం యువతకు, ముఖ్యంగా జెన్-జీ కి ఆనాటి గొడ్డలిపోటు, రక్త చరిత్ర కథనాలన్నీ మరోసారి కళ్లకూటినట్లు రివైండ్ అయ్యాయి. సోషల్ మీడియాలో దీనిపై రోజువారీగా వస్తున్న మీమ్స్, విశ్లేషణలు వైసీపీ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీశాయి. సొంత కుటుంబ వ్యవహారాలు, హత్య కేసుల సెటిల్మెంట్లపై పల్లెల్లో సైతం చర్చ జరుగుతుండటంతో, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి అధికారిక విద్యా వ్యవస్థను టార్గెట్ చేశారు.
లిక్కర్, ఇసుక స్కామ్‌ల గుట్టు రచ్చకెక్కడంతో డిఫెన్స్‌లో వైసీపీ
మరోవైపు, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన వేల కోట్ల రూపాయల ఇసుక, మైనింగ్ స్కామ్‌ల లెక్కలు ఇప్పుడు ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఎలా గండి కొట్టారో, లిక్కర్ సిండికేట్ల ద్వారా జనం సొమ్మును ఎలా దోచేశారో విచారణ సంస్థలు తవ్వుతుండటంతో ఆ పార్టీ క్యాడర్ పూర్తిగా డిఫెన్స్‌లో పడింది. వీటన్నింటికీ పరాకాష్టగా జగన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కేఎన్ఆర్ వ్యవహారం బద్దలవడం, ఆయన చేసిన సెటిల్మెంట్ల వెనుక ఉన్న పెద్దల హస్తంపై వస్తున్న కథనాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ భారీ ఆర్థిక నేరాల నుంచి, స్కామ్‌ల సుడిగుండం నుంచి ప్రజలు, మీడియా దృష్టిని మళ్లించడానికే జగన్ రెడ్డి తన పార్టీ యంత్రాంగం మొత్తాన్ని రంగంలోకి దించి.. విజయవంతంగా నడుస్తున్న డీఎస్సీపై అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారు.
డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ కాలం సాగవు!
వైసీపీ ఆడుతున్న ఈ డైవర్షన్ గేమ్ తాత్కాలికంగా కొంత గందరగోళాన్ని సృష్టించగలదేమో కానీ, దీర్ఘకాలంలో ఆ పార్టీకే చేటు తెస్తుంది. ఎందుకంటే, ఉద్యోగాలు సాధించి ఏడాది కాలంగా హ్యాపీగా జీతాలు తీసుకుంటున్న 16 వేల మంది ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు ఈ వ్యవస్థ పారదర్శకతను కళ్లారా చూశారు. ఒక పక్కాగా జరిగిన రిక్రూట్మెంట్పై రాజకీయ స్వార్థం కోసం బురద జల్లాలని చూస్తే.. ఆ 16 వేల కుటుంబాల నుంచి వచ్చే వ్యతిరేకత ప్రతిపక్షాన్ని మరింత పాతాళానికి నెట్టేస్తుంది. స్కామ్‌ల నుంచి తప్పించుకోవడానికి విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విద్యాశాఖను వాడుకోవడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలిచిపోతాయి.
