తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన, సున్నితమైన అంశం ఏదైనా ఉందంటే అది సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చుట్టూ తిరుగుతున్న రాజకీయ వ్యూహాలే. ప్రస్తుతం ఆయన రాజకీయంగా ఒక రకమైన ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు దూసుకుపోతున్న బీజేపీ.. ఈ రెండు పార్టీల వ్యూహకర్తల అంతిమ లక్ష్యం ఒక్కటే. హరీష్ రావును ఎలాగైనా భారత్ రాష్ట్ర సమితి నుండి బయటకు పంపేలా చేయడం, లేదా ఆయనే స్వయంగా విసిగిపోయి పార్టీ వీడేలా పరిస్థితులను కల్పించడం. ఎందుకంటే, ఉద్యమ కాలం నుండి క్షేత్రస్థాయి క్యాడర్లో పట్టున్న హరీష్ రావు గనుక గులాబీ గూటి నుంచి బయటకు వస్తే.. బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా నిర్వీర్యం అయిపోతుందనేది ఈ రెండు జాతీయ పార్టీల ఉమ్మడి ప్లాన్‌గా కనిపిస్తోంది.
అంతర్గత అవమానాలను సీరియస్‌గా తీసుకోని హరీష్!
గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాల్లో హరీష్ రావుకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదని, ఆయన కొన్ని అవమానాలను ఎదుర్కొంటున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా నడుస్తోంది. అయితే, ఒక సాధారణ నాయకుడిలా హరీష్ రావు వాటిని అవమానాలుగా భావించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు. 25 ఏళ్లుగా కేసీఆర్ నీడన నడిచిన ఆయన.. వీటన్నింటినీ రాజకీయ పరిణామాల్లో భాగమేనని భావిస్తున్నారు. పార్టీలో తనకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా, ఎంత చిన్న పని అప్పగించినా క్రమశిక్షణ గల సైనికుడిలా పని చేయడమే ఆయన శైలి. అంతే తప్ప, ఆయనకు బీఆర్ఎస్ వీడాలనే ఆలోచన గానీ, వేరే పార్టీ వైపు చూసే ఉద్దేశం గానీ అస్సలు లేదనేది నిఖార్సైన నిజం. ఇదే విషయాన్ని ఆయన ఆదివారం నాటి ప్రెస్ మీట్లోనూ “నా పుట్టుక, చావు రెండూ బీఆర్ఎస్ పార్టీలోనే” అంటూ పదే పదే స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ పేరుతో సరికొత్త నిందలు!
హరీష్ రావు విధేయతను శంకించేలా, ఆయన గ్రాఫ్‌ను తగ్గించేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో, కొన్ని రాజకీయ వేదికలపై పాత కథనాలను తెరపైకి తెస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. హరీష్ రావు ఆయనను కలిసేందుకు ప్రయత్నించారంటూ ఒక పాత ప్రచారాన్ని ఇప్పుడు మళ్లీ వాడుకుంటున్నారు. అసలు ఆనాడు ఏం జరిగింది, ఆ ప్రచారంలో ఎంతవరకు నిజముందనేది ఎవరికీ తెలియదు. కానీ, నేడు ఆయనను ఒంటరిని చేయడానికి, పార్టీ అధినాయకత్వానికి ఆయనపై అనుమానం కలిగేలా చేయడానికి ఈ పాత ముచ్చట్లను’ ఒక అస్త్రంగా వాడుకుంటూ నిందలు వేస్తున్నారు. ప్రత్యర్థులు పన్నుతున్న ఇటువంటి మైండ్ గేమ్‌లను గమనించకుండా, ఈ దుష్ప్రచారాలను నమ్మి ఒకవేళ బీఆర్ఎస్ గనుక హరీష్ రావును దూరం చేసుకుంటే.. అంతిమంగా కోలుకోలేని విధంగా నష్టపోయేది మాత్రం గులాబీ పార్టీయే.
ట్రబుల్ షూటర్ మార్క్ గ్రౌండ్ లెవెల్ లీడర్షిప్!
బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ బ్రెయిన్ అయితే, హరీష్ రావు హార్ట్ అండ్ సోల్ . పార్టీని స్థాపించిన 2001 నుండి నేటి వరకు ప్రతి ఉపఎన్నికలోనూ, సంక్షోభ సమయంలోనూ ట్రబుల్ షూటర్ గా హరీష్ రావు నిలిచిన తీరు అమోఘం. కేవలం సిద్దిపేట లేదా మెదక్ జిల్లాకే పరిమితం కాకుండా, ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు ప్రతి గ్రామంలోనూ హరీష్ రావుకు సొంతంగా ఒక అనుచర గణం, అభిమాన శ్రేణి ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ, అసెంబ్లీలో ప్రభుత్వంపై గళం విప్పే ఏకైక మాస్ లీడర్ ఆయనే. అటువంటి బలమైన నాయకత్వాన్ని అంతర్గత గొడవలు లేదా ప్రత్యర్థుల కుట్రల వల్ల కోల్పోతే.. క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది.
కాంగ్రెస్, బీజేపీల ద్వంద్వ వ్యూహం!
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ద్వంద్వ వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. హరీష్ రావుపై ఒత్తిడి పెంచడం ద్వారా ఆయనను ఇరకాటంలో పెట్టడం ఒకెత్తయితే, ఆయనను బీఆర్ఎస్ సొంత నేతలే అనుమానించేలా చేయడం మరొకెత్తు. హరీష్ రావు గనుక పార్టీలో యాక్టివ్ కాకపోతే, బీఆర్ఎస్లో మిగిలి ఉన్న కాస్తో కూస్తో క్యాడర్ కూడా గ్రౌండ్ లెవెల్లో డీమోరలైజ్ అయిపోతుంది. తద్వారా ఆ ఖాళీని తాము భర్తీ చేసి, తెలంగాణలో బీఆర్ఎస్ చాప్టర్ ను క్లోజ్ చేయాలనేది ఆ రెండు పార్టీల అసలు స్కెచ్. ఈ పొలిటికల్ ట్రాప్‌ను హరీష్ రావు ముందే గ్రహించారు కాబట్టే.. ఆయన ఎక్కడా లైన్ దాటకుండా, నిరంతరం పార్టీ లైన్‌కే కట్టుబడి ఉంటూ తన విధేయతను చాటుకుంటున్నారు.
జాతీయ పార్టీలు ఆడుతున్న ఈ మైండ్ గేమ్‌ను బీఆర్ఎస్ అధినాయకత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ప్రత్యర్థులు వేస్తున్న స్కెచ్లకు బలికాకుండా, హరీష్ రావు లాంటి సీనియర్, నమ్మకస్థుడైన నాయకుడికి మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించి క్షేత్రస్థాయిలోకి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రచారాల వెనుక ఉన్న కుట్రలను ఛేదించకుండా హరీష్ రావును పక్కనపెడితే, అది ప్రత్యర్థుల ప్లాన్‌ను స్వయంగా సక్సెస్ చేసినట్లే అవుతుందని, దీనివల్ల బీఆర్ఎస్ కోలుకోలేని దెబ్బ తింటుందనడంలో సందేహం లేదు.
