రాజకీయాల్లో కొన్ని వ్యూహాలు సొంత పార్టీని నిలబెడితే.. మరికొన్ని వ్యూహాలు మాత్రం ఆత్మహత్యాసదృశ్యంగా మారుతుంటాయి. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరవెనుక నడిపిస్తున్నట్లుగా భావిస్తున్న తెలంగాణ పొలిటికల్ స్కెచ్ ఖచ్చితంగా రెండో రకానికి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని.. తెలంగాణలో ఎవరెవరో ముక్కూ ముఖం తెలియని వ్యక్తులు హఠాత్తుగా తెరపైకి రావడం, ఆయన ఫోటోలను చెప్పులతో కొట్టడం లాంటి వింత వికృత చేష్టలకు పాల్పడటం వెనుక ఏపీ వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మార్క్ స్కెచ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తెలంగాణను పవన్ ఏమన్నారు?
పవన్ కల్యాణ్ ఎప్పుడూ తెలంగాణ సమాజాన్ని గానీ, ఇక్కడి సంస్కృతిని గానీ చిన్నచూపు చూసింది లేదు. పైగా తెలంగాణ అమరవీరుల పోరాటాన్ని, ఇక్కడి ఉద్యమ స్ఫూర్తిని తాను ఎంతగానో గౌరవిస్తానని ఆయన అనేక వేదికలపై బహిరంగంగానే చెప్పారు. ఆధ్యాత్మికంగా చూసినా.. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి స్వయంగా ప్రభుత్వం కూడా కేటాయించలేనంత భారీ నిధులను, ఆయన తనకున్న ప్రత్యేక చొరవతో టీటీడీ ద్వారా ఇప్పించి జీర్ణోద్ధరణ పనులు చేయిస్తున్నారు. చేనేత కార్మికులకు, ఆపదలో ఉన్న ఎంతోమంది తెలంగాణ ప్రజలకు తన సొంత సంపాదన నుంచి కోట్ల రూపాయల సహాయం చేసిన చరిత్ర పవన్‌కు ఉంది. అంతటి సానుకూలత ఉన్న నాయకుడిపై.. ఇప్పుడు హఠాత్తుగా కొందరు తెలంగాణ వాదుల ముసుగు వేసుకుని దాడికి దిగడం వెనుక పక్కా రాజకీయ కుట్ర దాగి ఉందనేది స్పష్టమవుతోంది.
తెలంగాణ ముసుగులో సజ్జల ఏజెంట్ల రాజకీయం!
ఈ వికృత ప్రచారాల వెనుక ఉన్న అసలు సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో స్థానికంగా ఉండే కొందరు పెయిడ్ ఆర్టిస్టులు, సోషల్ మీడియా ఏజెంట్లను రంగంలోకి దించి.. పవన్ కల్యాణ్‌పై కృత్రిమంగా ఒక వ్యతిరేకతను సృష్టించేందుకు సజ్జల గ్రూప్ తెరవెనుక గట్టిగానే ప్రయత్నిస్తోందని టాక్. అయితే, పక్క రాష్ట్రంలో పవన్‌ను తిట్టించడం వల్ల వైసీపీకి రాజకీయంగా, మైలేజ్ పరంగా వచ్చే ఒక్క శాతమైనా లాభం ఉందా అంటే అస్సలు లేదు. ఆ మాటకొస్తే, గత ఐదేళ్ల వైసీపీ అధికార పాలనలో కూడా ఇలాగే అందరినీ బూతులు తిట్టించి, ప్రతిపక్షాలపై వ్యక్తిగత దాడులు చేయించి ఆ పార్టీ సాధించింది ఏమీ లేదు, పైగా చారిత్రాత్మక ఓటమిని మూటగట్టుకుంది. కానీ, ఇలాంటి వికృత చేష్టల వల్ల ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డికి ఒక రకమైన సైకలాజికల్ శాటిస్ఫ్యాక్షన్ లభిస్తుందని, ఆ పట్టును వాడుకుని సజ్జల తన పదవిని, పట్టును నిలుపుకుంటున్నారు.
జగన్ దగ్గర పట్టు కోసం పార్టీకి సమాధి!
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయం తర్వాత జగన్ మోహన్ రెడ్డి దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. ఈ తరుణంలో తానేదో పెద్ద వ్యూహాలు పన్నుతున్నట్లు భ్రమింపజేయడానికి, తాను ఇప్పటికీ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టగలనని నిరూపించుకోవడానికి సజ్జల ఇలాంటి డైవర్షన్ అండ్ అటాకింగ్ ప్లాన్లను జగన్ ముందు ప్రెసెంట్ చేస్తున్నట్లు పొలిటికల్ టాక్. దీనివల్ల వైసీపీకి క్షేత్రస్థాయిలో మరింత నష్టం జరుగుతుంది, క్యాడర్ ప్రజల్లో పలచన అవుతుంది. అయినా సరే, పార్టీ నష్టపోయినా పర్లేదు కానీ, జగన్ దగ్గర తన పొలిటికల్ బ్రోకరేజ్ , హోదా తగ్గకూడదనే ఏకైక స్వార్థంతో సజ్జల ఈ తరహా చౌకబారు స్క్రిప్టులను సిద్ధం చేస్తున్నారని పాత కాపులే గుసగుసలాడుకుంటున్నారు.
మొదటి నుంచి ముంచేస్తున్న సజ్జల రాంగ్ అడ్వైజెస్’!
వైసీపీ చరిత్రను గమనిస్తే.. ఆ పార్టీ విజయసాయిరెడ్డి అన్నీ చూసుకున్నప్పుడు గెలిచింది. ఆ తర్వాత సజ్జల ముందుకు వచ్చారు. అప్పటి నుంచి అన్నీ ఎదురు దెబ్బలే. ఐదేళ్ల కాలంలో ప్రతిపక్షాలను కించపరచడం, కోర్టుల తీర్పులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఉద్యోగులను దూరం చేసుకోవడం, చివరకు వివేకా హత్య కేసులో నారాసుర రక్తచరిత్ర అంటూ పబ్లిక్‌గా ఫ్లాప్ స్క్రిప్టులు రాయడం.. ఇవన్నీ సజ్జల ఇచ్చిన రాంగ్ అడ్వైజెస్ వల్లే జరిగాయి. ఆ వ్యూహాలను నమ్ముకునే జగన్ రెడ్డి 151 సీట్ల నుండి దారుణంగా సింగిల్ డిజిట్‌కు పడిపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే సజ్జల స్కెచ్లను నమ్మి పక్క రాష్ట్రంలో పవన్‌పై బురద జల్లాలని చూస్తే.. అది సొంత కొరడాతో తమను తాము కొట్టుకున్నట్లే అవుతుందని క్యాడర్ తలలు పట్టుకుంటోంది.
పవన్ ఇమేజ్ను తాకలేరు.. వైసీపీకే మరింత చేటు!
పవన్ కల్యాణ్ ఇమేజ్ అనేది కేవలం ఏపీ సరిహద్దులకో, ఒక కులానికో పరిమితమైనది కాదు. ముఖ్యంగా తెలంగాణ యువతలో, జెన్-జీ లో ఆయనకున్న క్రేజ్, ఫాలోయింగ్ చాలా విభిన్నమైనది. కేవలం డబ్బులు ఇచ్చి కొంతమందితో రోడ్లపై డ్రామాలు చేయించినంత మాత్రాన పవన్ ఇమేజ్‌కు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ, ఈ కుట్రల వెనుక ఏపీ వైసీపీ హస్తం ఉందనే విషయం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుండటంతో.. వైసీపీ శ్రేణులకు ఇక్కడ కనీసం తిరిగే పరిస్థితి కూడా ఉండదు. స్కామ్‌ల నుంచి, ఏపీలో ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి సజ్జల నమ్ముకున్న ఈ బూతుల రాజకీయం అంతిమంగా వైసీపీకి ఉన్న కాస్తో కూస్తో క్రెడిబిలిటీని కూడా సమాధి చేయడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
