వైసీపీకి ఓ లెక్కుంది… అది కాస్తా తప్పిందా..?

రాజకీయ పార్టీ అంటే ప్రజా సేవ చేసేది కాదు, అధికారం చెలాయించేది అనుకునే నాయకులు ఎక్కువగా ఉన్న రోజులివి. ఏం చేసైనా సరే అధికారంలోకి రావడమే ముఖ్యం. ఓట్ల కోసం ఎత్తులు జిత్తులు చాలా ముఖ్యమైపోయాయి. ఆధునిక కాలంలో వ్యూహాత్మక ఎత్తుగడలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. వైసీపీ ఏకైక లక్ష్యం జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం. అది తప్ప ఆ పార్టీకి మరేదీ కనిపించడం లేదు. ఏదైనా రంగంలో ఏపీ కాస్త మంచి ఫలితాలు సాధించిందంటే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షం కూడా సంతోషించాలి. కానీ అలాంటి ఆనవాయితీని కూడా వైసీపీ పాటించడం లేదు. ఇప్పుడు కాపు ఓట్లపై కన్నేసింది. కాపు గర్జనకు, రిజర్వేషన్ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. సాక్షి మీడియా యథాశక్తి కాపు ఉద్యమానికి ఊతం ఇస్తోంది. తుని హింసాకాండకు జగన్ పార్టీయే కారణమని టీడీపీ నాయకులు తీవ్రంగా ఆరోపించారు. దీన్ని వైసీపీ ఖండించింది. ఆ ఆరోపణ నిజమా కాదా అనేది విచారణలోనే బయటపడుతుంది. విధ్వంసం చేయించింది వైసీపీనా కాదా అనేది వేరే విషయం. కాపు ఉద్యమానికి అన్ని విధాలుగా అండగా నిలిచిన పార్టీ మాత్రం అదే అనేది ఏపీలో అందరికీ అర్థమైంది. ప్రస్తుతం బీసీల జాబితాలో ఉన్న వారికి కూడా అర్థమైంది. కాపులకు మద్దతిస్తే 15 శాతం పైగా ఉన్న ఆ వర్గం ఓట్లు గంప గుత్తగా ఫ్యాన్ గుర్తుకు పడతాయనేది వైసీపీ లెక్క కావచ్చు. అదే నిజమైతే, ప్రస్తుత బీసీల ఓట్లు గంప గుత్తగా ఆ పార్టీకి దూరమైపోతే? దాదాపు 50 శాతం ఉన్న బీసీలు వైసీపీకి ఓటు వేయవద్దని నిర్ణయిస్తే సీన్ రివర్స్ అయిపోతుంది. కేవలం రెడ్డి, కాపు ఓట్లతో అధికారంలోకి రావడం కల్ల. సమాజంలో సగభాగం దాకా ఉండే బీసీలను దూరం చేసుకున్న ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. వైసీపీ ఎత్తుగడ వల్ల బీసీల్లో చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. కాపులను బీసీల్లో చేరిస్తే రిజర్వేషన్లలో తమ వాటా తగ్గిపోతుందని బీసీలు ఆందోళన చెందుతున్నారు. బీసీలకు అన్యాయం జరగకుండానే కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలనే ధోరణిలో వైసీపీ నాయకుడు మాట్లాడటం లేదు. అసలు బీసీల ఊసే ఎత్తకుండా కాపులను మాత్రమే దువ్వుతున్నారు. ప్రెస్ మీట్లలో కూడా ఎంతసేపూ కాపులకు వత్తాసు పలకడం, టీడీపీని దుయ్యబట్టం, చంద్రబాబును తిట్టడం, తనకు పదవి ఎప్పుడెప్పుడు వస్తుందా అనే అసహనాన్ని ప్రదర్శించడం జగన్ కు అలవాటుగా మారింది. పదవి రాలేదనే అసహనం ఇంత బాహాటంగా వెళ్లగక్కే రాజకీయ నాయకులు చాలా చాలా అరుదు. జగన్ వ్యవహార శైలి, మాటలు గమనించిన వారికి, టీడీపీ ఆరోపణ నిజమేనేమో అనిపిస్తే అది మరీ ప్రమాదం. విధ్వంసాన్ని కూడా ఆయనే చేయించారనే ఆరోపణ చాలా తీవ్రమైంది. అది నిజం అనిపించేలా వైసీపీ నాయకులు, వారి మీడియా ప్రవర్తిస్తే బీసీలు ఇక ఆ పార్టీకి ఓటు వేయడం దుర్లభం. అదే జరిగితే ఇప్పుడున్న సీట్లలో సగమైనా గెలవం కష్టం. 2019 కోసం ఇప్పటి నుంచే స్కెచ్ వేసిన వైసీపీ, కాపు ఓట్ల కోసం అత్యుత్సాహం తో పన్నిన వ్యూహం బెడిసికొడుతుందా? అలా ఏమీ జరగదని అనుకుందామంటే… మరి కాపులు, బీసీలు ఏకకాలంలో వైసీపీని నమ్మడం ఏ విధంగా సాధ్యం? బీసీలకు నష్టం జరగకుండా కాపులకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ సూటిగా, స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా జగన్ చెప్పడం లేదు. అదే వైసీపీకి నష్టం కలిగించ వచ్చంటున్నారు పరిశీలకులు. వైసీపీ తన ప్రస్థానంలో అనేక తప్పటడుగులు వేసింది. వాటికి మరొకటి చేరింది. 2019లో లాభం కంటే నష్టం ఎక్కువ తెచ్చిపెట్టే వ్యూహం, తమకు శాపంగా మారుతుందేమో అని కొందరు వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎత్తుగడ ఫలితం ఏమిటో తెలియాలంటే కొన్నేళ్లు వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close