కోస్తాంధ్రలో జగన్ కి అభ్యర్థులు కరువయ్యారా ?

వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ఇన్నేళ్లుగా పార్టీని నడుపుతూ, ఇప్పుడు ఆఖరి నిమిషంలో పార్టీని చేరుతున్న వారికి టికెట్లు ఇస్తానని చెప్పడం చూస్తుంటే కోస్తాంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి అభ్యర్థులు కరువయ్యారా అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.

వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ తన పార్టీ చాలా బలంగా ఉందని, తామే అధికారంలోకి రాబోతున్నామని ఎప్పటి నుండో చెబుతూ వస్తున్నారు. కోస్తాంధ్రలో సైతం తమ పార్టీ గణనీయమైన స్థానాలు గెలవబోతోందని వైఎస్ఆర్ సీపీ నాయకులు కూడా చెబుతూ వస్తున్నారు. అయితే ఇంత కాలంగా పార్టీలో ఉన్న వాళ్లను కాదని జగన్ ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి టికెట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు.

దాడి వీరభద్రరావుకు అనకాపల్లి టికెట్?

దాడి వీరభద్రరావు కూడా వైఎస్సార్ సీపీ లో చేరుతున్నారు. గతంలో వైసీపీ లో ఉండి ఆ తర్వాత వైఎస్సార్సీపీని నుండి బయటకు వచ్చిన ఈయన జగన్ పై విమర్శల దాడి చేశారు. అయితే వైయస్సార్సీపి ని వీడిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతారన్న విషయంపై చాలా కాలంపాటు స్పష్టత లేదు. ఆ మధ్య జనసేనలో దాడి వీరభద్రరావు చేరబోతున్నారని బలంగా వినిపించింది. పవన్ కళ్యాణ్ కూడా దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లి మరీ ఆయనను కలిశారు. అయితే పవన్ కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ దాడి వీరభద్రరావు, తన అనుచరులతో సమావేశమైన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో నొచ్చుకున్న పవన్ కళ్యాణ్ దాడి వీరభద్రరావు ని పూర్తిగా లైట్ తీసుకున్నారు. పైగా దాడి వీరభద్రరావు ఏ పార్టీతో మాట్లాడినప్పటికీ తనకు ఒక ఎంపీ సీటు, తన కుమారుడికి ఒక ఎమ్మెల్యే సీటు అడుగుతున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఏ పార్టీతో కూడా ఆయన చర్చలు చాలా కాలంపాటు కొలిక్కి రాలేదు. ఇప్పుడు జగన్ తో ఈయన చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు, అనకాపల్లి ఎంపీ టికెట్ కేటాయించడానికి జగన్ అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరుతున్న దాడి వీరభద్రరావు కి టికెట్ ఇవ్వడానికి జగన్ అంగీకరించడంతో, ఇప్పటిదాకా అనకాపల్లి లో జగన్ పార్టీ బలంగా లేదని జగనే ఒప్పుకున్నట్టు అయిందని విమర్శకులు అంటున్నారు.

కొత్తగా చేరిన రఘురామకృష్ణ రాజుకు టికెట్?

అలాగే రఘురామకృష్ణంరాజు ఆ మధ్య వైఎస్ఆర్ సీపీని వీడి టీడీపీలో చేరారు. చేరిన కొత్తలో జగన్ ని అపరిచితుడు సినిమాలోని పాత్ర తో పోలుస్తూ జగన్ సైకో అన్న అభిప్రాయం వచ్చేలా తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు అదే రఘురామకృష్ణంరాజు కి జగన్ నరసాపురం లోక్ సభ టిక్కెట్ ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకాలంగా నియోజకవర్గంలో పార్టీని అంటిపెట్టుకున్న వారిపై నమ్మకం లేకపోవడంతోనే జగన్ ఇప్పుడు కొత్తగా చేరిన రఘురామ కృష్ణంరాజు కు టికెట్ కేటాయిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

కిల్లి కృపారాణి కి శ్రీకాకుళం టికెట్ ఇస్తారా?

ఇక ఈ మధ్య పార్టీలో చేరిన మరొక లీడర్ శ్రీకాకుళం కి చెందిన కిల్లి కృపారాణి. కాంగ్రెస్ పార్టీ లో కేంద్ర మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణి కి కూడా పార్టీలో చేర్చుకునే ముందు జగన్ శ్రీకాకుళం టికెట్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల పార్టీలో చేరిన జయసుధ కూడా ఎంపీగా పోటీ చేయాలని ఆశిస్తోంది. మరి ఆమెకు జగన్ హామీ ఇచ్చాడా లేదా అన్నది ఇంకా తెలియడం లేదు.

ఇలా ఇప్పుడు కొత్తగా చేరుతున్న వాళ్లకు జగన్ టికెట్ హామీ ఇవ్వడం, టికెట్ హామీ ఇచ్చి మరి వీరిని పార్టీలోకి చేర్చుకోవడం చూస్తుంటే, కోస్తాంధ్రలో ఇదివరకు ఉన్న అభ్యర్థుల మీద జగన్ కి నమ్మకం లేదా? లేదంటే టికెట్ హామీ ఇచ్చి మరీ వీరిని చేర్చుకుంటే తప్ప పార్టీ బలోపేతం కాదని జగన్ భావిస్తున్నారా అన్నది అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

మొత్తానికి ఇప్పుడు కొత్తగా చేరుతున్న నాయకుల వల్ల పార్టీకి , జగన్ కి ఎంతవరకు లాభం చేకూరుతుంది అన్నది ఎన్నికలయ్యాక తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com