ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నేతలు తాము అన్నింటికీ అతీతం అనుకుంటున్నారు. చట్టాన్ని, న్యాయవ్యవస్థను ఏమాత్రం లెక్కచేయడం లేదు. తాము చట్టానికి అతీతమనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కండిషన్ బెయిల్పై ఉన్నప్పటికీ కోర్టు నిబంధనలను ఉల్లంఘించడం, పోలీసు నోటీసులను బేఖాతరు చేయడం వంటి చర్యలు సహజంగా మారిపోయాయి.
జైలుకు వెళ్తే సానుభూతి వస్తుందనే భ్రమ
వైసీపీ నేతల్లో చాలామంది అరెస్టును ఒక అలంకారం గా భావిస్తున్నారు. ఒకసారి జైలుకు వెళ్లి వస్తే జనం నుంచి సానుభూతి లభిస్తుందనే తప్పుడు అంచనాలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. అందుకే తేల్చుకుందాం రండి.. మేము వస్తే రప్పా రప్పా వంటి వివాదాస్పద వ్యాఖ్యలు అదే పనిగా చేస్తున్నారు. ఇవి చట్టం పట్ల వారికి ఉన్న గౌరవాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అంబటి రాంబాబు అరెస్టు తర్వాత.. ప్రతి చోటా రౌడీ ఇమేజ్ ఉన్న నాయకుడు ప్రెస్మీట్ పెట్టి ఇవే బెదిరింపులకు పాల్పడుతున్నారు.
అత్యంత ఘోరమైన భాష.. విలువల పతనం
ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వ్యక్తులు అత్యంత అసభ్యకరమైన , రెచ్చగొట్టే భాషను వాడటం విలువల పతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. పోలీసు అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కోరినప్పుడు, వారిపైనే దురుసుగా ప్రవర్తించడం, కోర్టుల పట్ల గౌరవం లేని వ్యాఖ్యలు చేయడం ద్వారా వ్యవస్థలను నీరుగారుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చట్టాన్ని గౌరవించే సామాన్యుడికి, నిబంధనలను ఉల్లంఘించే ఈ నేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గిపోతోందని, ఇది సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.
చట్టం , న్యాయం పవర్ తెలియాల్సిన సమయం
చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయాన్ని ఈ నేతలకు గుర్తు చేయాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని చర్చ సాగుతోంది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే వ్యవస్థల పట్ల భయం, భక్తి కలుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంబటి రాంబాబు కేసులో కోర్టు రిమాండ్ విధించడం ఒక సంకేతమని, రాబోయే రోజుల్లో ఇతర నేతల తీరుపై కూడా చట్టం తన పంజా విసిరే అవకాశం ఉందని తెలుస్తోంది. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదనే నిజాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
