రాజకీయాల్లో సిగ్గు, ఎగ్గు విడిచి మాట్లాడటంలో తమకు సాటిలేరని వైసీపీ నేతలు మరోసారి నిరూపించుకుంటున్నారు. ఐదేళ్ల పాటు అధికార మదంతో వ్యవస్థలను చెల్లాచెదురు చేసి, అడ్డగోలుగా వ్యవహరించిన నేతలు.. ఇప్పుడు నీతులు చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారు. ప్రజాస్వామ్యం, వ్యవస్థల పనితీరు, పోలీసుల బాధ్యతలపై సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు విశ్లేషణలు చేస్తుంటే.. వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు వైసీపీ నేత అన్న చందంగా ఉందని నోళ్లు నొక్కుకోవాల్సి వస్తోంది.
నాడు సాక్షాత్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీద గూండాలతో దాడులు చేయించి, ఆ దౌర్జన్యాన్ని సమర్థించుకున్న చరిత్ర జగన్ రెడ్డిది. కనీసం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపైనే కేసులు పెట్టి, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని బీపీలు వచ్చాయి.. అందుకే దాడులు జరిగాయి అని అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడటం ఏ రకమైన ప్రజాస్వామ్యమో వీరు చూపించారు. నాటి అరాచకాలను రాష్ట్రం ఇంకా మర్చిపోలేదని, ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని ఈ నేతలు గుర్తించాలి.
ఇక సజ్జల రామకృష్ణారెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని బెదిరిస్తున్నారు. కానీ, ఇప్పుడు తాము అనుభవిస్తున్నది గతంలో తాము చేసిన పాపాలకు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న అసలైన రిటర్న్ గిఫ్ట్ అని ఆయన గ్రహించలేకపోతున్నారు. చట్టాన్ని చుట్టంలా మార్చుకుని, పోలీసు వ్యవస్థను వ్యక్తిగత సైన్యంగా వాడుకున్న వైసీపీ నేతలకు.. నేడు చట్టబద్ధంగా జరుగుతున్న విచారణలు చూసి గజగజ వణికిపోతున్నారు. తాము చేసిన ఘోరాలకు ఫలితం అనుభవించక తప్పదని వారికి అర్థమవుతోంది.
ప్రస్తుత ప్రభుత్వం ఎంతో సంయమనంతో, చట్టానికి లోబడి వ్యవహరిస్తోంది కాబట్టే వైసీపీ నేతలు ఇంకా స్వేచ్ఛగా బయట తిరిగి ఇన్ని కబుర్లు చెప్పగలుగుతున్నారు. నిజంగా జగన్ రెడ్డి హయాంలో జరిగినట్లుగా అరాచకమే రాజ్యమేలితే.. ఈ పాటికి వైసీపీ పరిస్థితి ఊహకే అందనంత దారుణంగా ఉండేది. లా అండ్ ఆర్డర్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పద్ధతిగా వెళ్తుంటే, దానిని బలహీనతగా భావించి ప్రజాస్వామ్యం గురించి ప్రవచనాలు పలకడం వారికే చెల్లిందని ప్రజలు అనుకుంటున్నారు.