నంద్యాల ఓట‌మిలో కొత్త కోణం..జ‌గ‌న్ స‌న్నిహితులే ముంచేశారా!

విన‌డానికి ఆశ్చర్యంగా ఉన్న‌ప్ప‌టికీ దీన్ని ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ కొట్టిపారేయ‌డం లేదు. నంద్యాల‌లో వ‌చ్చిన మెజారిటీ చంద్ర‌బాబును సైతం అబ్బుర‌ప‌రిచింద‌ని అంటున్నారు. నిప్పు లేనిదే పొగ ఎలా రాదో.. ఇది అలాగే జ‌రిగి ఉంటుందంటున్నారు. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడైన ఓ ఎంపీ, రాయ‌ల‌సీమ‌కు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు లోపాయ‌కారీగా తెలుగుదేశం అభ్య‌ర్థి గెలుపొందేందుకు కృషి చేశార‌ని తెలుస్తోంది. దీనికి కార‌ణ‌మేమై ఉంటుందో విశ్లేష‌కుల‌కు సైతం అంతుప‌ట్టడం లేదు. బ‌హుశా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హార‌శైలి న‌చ్చ‌క పార్టీ నుంచి నిష్క్ర‌మించిన‌… పార్టీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. నిశ్శ‌బ్దంగా సాగిపోతున్న నాయ‌కుల‌ను ఇందుకు వారు ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గానే ఇంత ప‌వ‌ర్‌ఫుల్‌గానూ… ఆత్మ‌విశ్వాసంతోనూ.. వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక‌లో గెలిస్తే.. త‌మ‌కు మ‌రింత క‌ష్ట‌మ‌వుతుంద‌నీ.. ఆయ‌న్ను అదుపులో ఉంచ‌డం అసాధ్య‌మ‌వుతుంద‌నీ వారు భావించార‌నీ.. అందుకే ఉడ‌తా భ‌క్తిగా టీడీపీ అభ్య‌ర్థికి త‌మ శ్రేణులు నంద్యాల‌లో ఓటేసేలా ప్రోత్స‌హించార‌నీ అంటున్నారు. తెలుగు దేశం పార్టీ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో కూడా ఇదే ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిందని తెలుస్తోంది. జ‌గ‌న్ చుట్టూ ఉన్న అనుభ‌వ‌శూన్యులు.. ఆరంభ‌శూరులు..త‌మ ప‌బ్బం గడుపుకోవాల‌నే చూసే స్వార్థ‌ప‌రులు ఇస్తున్న స‌ల‌హాలు ఆయ‌న్ను ముంచేస్తున్నాయి. ఒక ర‌కంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌మ పార్టీ నాన్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రూపంలో గెలుపు గుర్రంలా మారార‌ని తెలుగుదేశం వ‌ర్గాలు అంటున్నాయి. జ‌గ‌న్ చేస్తున్న అనాలోచిత వ్యాఖ్య‌లు టీడీపీకి గెలుపు బాట ప‌రుస్తున్నాయ‌నేది నిర్వివాదాంశం. నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభంతో చంద్ర‌బాబు న‌ల‌బై ఏళ్ళు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని వ్యూహాత్మ‌కంగా రెచ్చ‌గొట్టేలా చేస్తున్నార‌నీ, టీడీపీ వ్యాఖ్య‌ల వెనుక ఉద్దేశాన్ని గ‌మ‌నించుకోలేక‌.. ఆయ‌న సంయ‌మ‌నాన్ని కోల్పోయి ఉచ్చంనీచం మ‌రిచి, రెచ్చిపోయి చంద్ర‌బాబుపై అసంద‌ర్భ‌, అప్ర‌తిష్టాత్మ‌క వ్యాఖ్య‌లు చేస్తున్నార‌నీ అంటున్నారు. ఇదే నిజ‌మైతే…. పీకే.. ప్ర‌శాంత్ కిషోర్ ఏం చేస్తున్నాడు. అన్నం పెట్టే చేతిని కుక్క‌యినా క‌ర‌వ‌దని సామెత‌. ఇక్క‌డ అన్నం పెట్టే చేయి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన‌లేము కానీ, ఇప్పుడాయ‌న చుట్టూ చేరిన స్వార్థ‌ప‌రులు రేపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ల కోస‌మే క‌దా! అలాంట‌ప్పుడు ఆయ‌నకు చెప్పాల్సిన విధంగా చెప్పి చూడ‌న‌వ‌స‌రం లేదా? జ‌గ‌న్ ఒక్క‌డే పార్టీని అధికారంలోకి తేవ‌డం క‌ల్ల‌ని ప్ర‌శాంత్ ఎప్పుడో తేల్చి చెప్పారు. అంటే.. ప్ర‌జ‌లొచ్చినంత మాత్రానా నీకు ఓట్లు వేస్తార‌ని కాదు స్వామీ అని చెప్ప‌డ‌మే. దీన్ని జ‌గ‌న్ అర్థం చేసుకోవాలి. వైఖ‌రి మార్చుకోవాలి. ఆ చిరునవ్వు మాటున ఎటువంటి క‌ల్మ‌ష‌మూ లేకుండా చూసుకోవాలి. ఆయ‌నే కాకుండా.. త‌న స‌హ‌చ‌రులు కూడా అధికార ప‌క్షం లేదా ప్ర‌త్య‌ర్థిపై విష‌పూరిత‌మైన‌.. అస‌హ‌నంతో కూడిన వ్యాఖ్య‌ల‌కు దిగ‌కూడ‌దు. ఇప్ప‌టికైనా మించిపోయింది లేదు. మీ చుట్టూ ఉన్న‌వారు స్వార్థ‌ప‌రులే త‌ప్ప‌… పార్టీ కోసం పాటుప‌డే వారెవ‌రూ లేర‌నీ గుర్తించాలి. సొంత బాబాయ్ అయి ఉండి కూడా.. త‌న ఇంటిముందే మీసం తిప్పి, తొడ‌గొట్టిన వివేకానంద‌రెడ్డి ఉదంతాన్నీ జ‌గ‌న్ గుర్తుచేసుకోవాలి.
-సుమ‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.