ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వైసీపీకి పెద్ద సవాలుగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సాధారణంగా ఏ ఎన్నికలకైనా ముందస్తుగా సిద్ధమయ్యే వైఎస్ జగన్, ఈసారి స్థానిక ఎన్నికల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కపెడుతున్నట్లు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి ప్రభావం క్యాడర్‌పై బలంగా ఉంది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగం చెల్లాచెదురైపోయింది. ఇన్-ఛార్జులను మార్చాలా? లేక పాత వారితోనే వెళ్లాలా? అన్న సందిగ్ధంలో నాయకత్వం కొట్టుమిట్టాడుతోంది. నిధులు వెచ్చించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కరువవ్వడం, ఆర్థిక వనరులు ఉన్నవారు పార్టీ మారేందుకు సిద్ధమవ్వడం వైసీపీని రక్షణలో పడేస్తోంది.
పులివెందుల భయం – పరువు పోతుందనే ఆందోళన
వైసీపీకి కంచుకోటగా భావించే పులివెందులలో కూడా ఇప్పుడు పరిస్థితి సానుకూలంగా లేదనే సమాచారం జగన్‌ను కలవరపెడుతోంది. సొంత ఇలాకాలో ఓడిపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని అంచనా వేస్తున్నారు. కేవలం ఎమ్మెల్యే స్థానమే కాదు, మున్సిపాలిటీలు , జెడ్పీటీసీ స్థానాల్లో కూడా కూటమి బలంగా ఉండటంతో, పోటీ చేసి ఓడిపోవడం కంటే పక్కకు తప్పుకోవడమే మేలనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి వంటి కీలక నేతలు జగన్‌కు ఎన్నికల బహిష్కరణ దిశగా సలహాలు ఇస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బాధ్యతారాహిత్యమో.. లేక భయమో?
ఓటమికి భయపడి ఎన్నికలకు దూరంగా ఉండటం ప్రజాస్వామ్యంలో సరైన సంకేతం కాదు. కానీ, వైసీపీ మాత్రం ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం అవుతోంది, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయి అనే నెపంతో ఎన్నికల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి క్షేత్రస్థాయిలో అభ్యర్థులు దొరకకపోవడం, ఉన్నవారు కూడా ఖర్చుకు భయపడటం వల్ల జగన్ రెడ్డి పార్టీని కాపాడుకోవడానికి ఈ ఎగ్జిట్ రూట్ ను ఎంచుకునే అవకాశం ఉంది. చేతకాని తనంతో బహిష్కరించడం వల్ల పార్టీ మరింత బలహీనపడుతుందని క్యాడర్ భయపడుతోంది.
కూటమి దూకుడు – వైసీపీ రక్షణాత్మక ధోరణి
మరోవైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అప్పుడే ఎన్నికల శంఖారావం పూరించారు. నామినేటెడ్ పదవుల భర్తీ , అభివృద్ధి పనుల వేగవంతం ద్వారా ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ పోరాట పటిమను ప్రదర్శించాల్సింది పోయి ఇంకా ఇళ్లకే పరిమితమవ్వడం ఆ పార్టీ పతనాన్ని సూచిస్తోంది. డబ్బు ఇచ్చే నేతలకు ఇన్-ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ, పార్టీ సిద్ధాంతాలను గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎన్నికల నుంచి వైసీపీ తప్పుకుంటే, అది వచ్చే 2029 సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పంచాయితీ స్థాయి నుంచి పట్టు కోల్పోతే, తిరిగి పుంజుకోవడం దాదాపు అసాధ్యం. జగన్ రెడ్డి తీసుకునే ఈ ‘బహిష్కరణ’ నిర్ణయం ఆయన రాజకీయ జీవితంలో ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
