ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది. ఫోన్లతోనే లైవ్ టెలికాస్ట్ చేసేస్తున్నారు. కానీ 30 ఏళ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేది ?. ఓ టీవీ చానల్ రోజంతా కార్యక్రమాలు ప్రసారం చేయడం అంటే అద్భుతం. అలాంటి అద్భుతాన్ని తెలుగులో ఈటీవీ సాధించింది. అనితర సాధ్యమైన కృషితో… క్యాసెట్లను శ్రీలంకకు పంపించి.. సమయానికి ఎయిర్ చేయాల్సిన కఠినమైన పరిస్థితుల్లో చానల్‌ను లాంచ్ చేశారు. మెల్లగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ… దేశమంతా విస్తరించారు. ఇది టెక్నికల్ విజయాలు. ప్రజల నమ్మకాన్ని చూరగొనకపోతే ఇంత సుదీర్ఘ పయనం సాధ్యమయ్యేది కాదు. అసలు విజయం అదే.
పద్దతైన వినోదాలు
ఈటీవీ అంటే చిన్న బీప్ సౌండ్ కూడా వినిపించని పద్దతైన చానల్. చానల్ ప్రారంభమైనప్పుడు ఎంతో వినోదం అందిస్తున్నారో అంత విజ్ఞానం కూడా అందించారు. ఈటీవీ సీరియల్స్ మ్యూజిక్ వినిపించని ఇళ్లు అప్పట్లో ఉండేవి కావు. ప్రతి ఇంట్లోకి చొచ్చుకెళ్లిపోయాయి. ఇవి చూడకూడదు అని అనిపించే ప్రోగ్రాం ఉండకపోవడం ఈటీవీ ప్రత్యేకత. పద్దతైన వినోదాలు అందించడంలో ఇప్పటికీ తన ప్రత్యేకత చూపిస్తోంది. జబర్దస్త్ విషయంలో విమర్శలు ఎదుర్కొంది కానీ.. ఆ విమర్శలకూ జస్టిఫికేషన్ ఆ చానల్ ఇచ్చుకుంది.
నమ్మకమైన వార్తలు
ఒక తరం ప్రతి శుక్రవారం .. దూరదర్శన్ లో వచ్చే చిత్రలహరిని ఎలా చూసేదో.. ఈటీవీ వచ్చిన తర్వాత రాత్రి 9 గంటలకు వచ్చే వార్తలు అలా తర్వాత తరాలు చూస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ రాత్రి 9 అయ్యేసరికి ఈటీవీ న్యూస్ మాత్రమే చూసేవాళ్లు. అంత నమ్మకం కలిగించుకుంది. ఈ నమ్మకం ఎంత బలమైనదంటే.. ఇరవై నాలుగు గంటల న్యూస్ చానళ్ల విప్లవం వచ్చి…. ఏళ్లు గడుస్తున్నా.. సెన్సేషనలిజమే జర్నలిజం గా మారిపోయిన ఈ సమయంలోనూ… 9 గంటల ఈటీవీ న్యూస్ కు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. నమ్మకం పునాదులు అంత బలంగా ఉంటాయి.
దేశవ్యాప్తంగా జెండా పాతిన ఈటీవీ
ఈటీవీ తెలుగు విజయవంతం అయిన తర్వాత రామోజీరావు చాలా భారతీయ భాషల్లో ఇన్ఫోటెయిన్ మెంట్ చానళ్లు ప్రారంభించారు. అంటే ప్రతి గంటకు ఐదు నిమిషాల వార్తలు.. మిగతా ఎంటర్ టెయిన్ మెంట్. అప్పటికి న్యూస్ చానళ్ల విప్లవం రాలేదు. వచ్చిన తర్వాత పూర్తి స్థాయి న్యూస్ చానళ్లు , ఎంటర్ టెయిన్మెంట్ చానళ్లుగా మార్చారు. కన్నడలో, ఐడియాలో , గుజరాతీలో, యూపీ, బీహార్ లో చివరికి కశ్మీర్ లో కూడా ఈటీవీలో ఎంతో గొప్పగా స్థిరపడింది. తర్వాత రాజకీయ కుట్రల్లో భాగంగా ఆయన సంస్థలపై ఆర్థికపరమైన దాడులు చేయడంతో.. ఆ చానళ్లను రిలయన్స్ నెట్ వర్క్ కు విక్రయించారు. న్యూస్ 18 పేరుతో ఇప్పుడు అవి దేశంలో కొన్ని కోట్ల మందిని అలరిస్తున్నాయి.
ఈటీవీ.. మీటీవీ అని స్లోగన్. నిజంగానే.. ఈటీవీ తెలుగువారందరి టీవీ అయింది. ఇప్పటికీ అందరి అంచనాలను అందుకుంటూనే ఉంది. కొత్త తరం ఇప్పుడు ఈటీవీ నిర్వహణను చేపట్టింది. విలువల్ని కాపాడుతూ.. అదే ఒరవడి కొనసాగిస్తారని ఆశిద్దాం !