”మొదటి ప్రేమకు మరణం లేదు. అది మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది” బేబీ సినిమాలోని డైలాగ్ ఇది. ఇప్పుడు అదే డైలాగ్ రాసిన నిర్మాతలు.. ‘తొలిప్రేమ అంత తోపు కాదు’ అనే యాంగిల్ లో ఓ కథ చెబుతున్నారు. కిరణ్ అబ్బవరం ఇందులో హీరో. గౌరీ ప్రియా హీరోయిన్. ఈ సినిమాకి చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ పెట్టారు. గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఒక ప్రశాంతమైన సముద్రపు ఒడ్డున కూర్చుని హీరో హీరోయిన్ మాట్లాడుకుంటున్న ఈ గ్లింప్స్‌లో చాలా ఆసక్తికరమైన సంభాషణలు ఉన్నాయి.
”ఫస్ట్ లవ్ ఒకసారి ఫెయిల్ అయితే నరకం. మొదటి ప్రేమలో ఒక ప్యూరిటీ ఉంటుంది, నిజాయితీ ఉంటుంది” అని హీరోయిన్ అంటుంది. ఈ డైలాగ్ చెప్పగానే ”మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలు తల్లి ప్రేమ దగ్గరే ఆగిపోవాలి కదా” అని హీరో చెప్పడం ఇంట్రెస్టింగ్ యాంగిల్.
”చరిత్రలో ఎన్నో ప్రేమ గొప్ప కథలు ఉన్నాయి. వాళ్లందరికీ కూడా అవి మొదటి ప్రేమలు అయితే కాదు. ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిందంటే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలై ఉంటుంది. ఒకే చోట కదలకుండా కూర్చుంటే కాసేపు తర్వాత కాలు కూడా తిమ్మిరెక్కుతుంది. మనసు కూడా అంతే. ఒక్కసారి కదిపి చూడండి. మెల్లగా అడుగులు వేస్తూ అదే పరిగెడుతుంది. అంతేగాని వాడెవడో తొలిప్రేమ.. నా సమాధి.. బొచ్చు భోషాణం అంటే దాన్ని పట్టుకుని కూర్చోవడం ఏంటండీ. అలా అయితే నేను కూడా చాలా చెప్తా.. తొలిప్రేమ అంత తోపేం కాదు” — ఇది హీరో యాంగిల్.
ఈ గ్లింప్స్‌తోనే ఇది ఎలాంటి కథో అర్థమైపోతుంది. సాయి రాజేష్ కథతో ఎస్కేఎన్ నిర్మాణంలో రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మణిశర్మ మ్యూజిక్ ఇవ్వడం మరో విశేషం.