ప్రభాస్ `రాజాసాబ్` రిలీజ్ డేట్ పక్కా అయ్యింది. డిసెంబరు 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. టీజర్ డేట్ కూడా బయటకు వచ్చేసింది. ఈనెల 16న ఉదయం 10.52లకు టీజర్ విడుదల చేస్తారు. నిజానికి ఈ టీజర్ ఎప్పుడో కట్ చేశారు. కానీ రిలీజ్‌కు బాగా టైమ్ ఉండడంతో పెండింగ్ లో పెట్టారు. ప్రభాస్ ఇటీవలే టీజర్‌కు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పాటుగా టీజర్ చూపించాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు మరో 4 రోజులు ఆలస్యంగా 16న విడుదల చేస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో, విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చాలా కీలకమైన మూవీ. ఎందుకంటే ఈమధ్య పీపుల్ మీడియా అన్నీ పరాజయాలే చవి చూస్తోంది. ఆ సంస్థ మళ్లీ పుంజుకోవాలంటే ‘రాజాసాబ్’తో హిట్టు కొట్టడం చాలా అవసరం. ఏప్రిల్ లో ఈ సినిమా రావాల్సింది. కానీ ప్రభాస్ `ఫౌజీ`తో బిజీగా ఉండడం, అనారోగ్యంతో కాస్త విరామం తీసుకోవడంతో షూటింగ్ ఆలస్యమైంది. దాంతో పాటు కొంత రీ షూట్ కూడా అవసరమైంది. అందుకే సమ్మర్ రేస్ నుంచి తప్పుకోవాల్సివచ్చింది. ప్రభాస్ మరో 20 రోజులు కాల్షీట్లు కేటాయిస్తే ఈ సినిమా పూర్తయినట్టే. వీఎఫ్ఎక్స్ కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. దాని కోసం ఎక్కువ సమయం తీసుకోబోతున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్ క్లాసిక్ కి ఈ సినిమా కోసం రీమిక్స్ చేయబోతున్నట్టు సమాచారం.