జూబ్లిహిల్స్ లోని కవిత నివాసం గురువారం రాత్రి సంబరాలతో మార్మోగిపోయింది. అక్కడేం జరుగుతుందో తెలిసిన వాళ్లకు ఆ సంబరాలు ఎందుకో అర్థం కాలేదు. కాసేపటికి వారికి క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్న కారణంగా కవిత నివాసంలో సంబరాలు చేస్తున్నారు. ఈ పరిణామం కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం.
అంతకు మించి.. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా పెద్దగా సంబరాలు చేసుకోలేదు. మంత్రులు మాత్రమే కాస్త స్వీట్లు పంచుకున్నారు. కానీ కాంగ్రెస్ నేతల కంటే ఎక్కువగా జాగృతి అధ్యక్షురాలు కవిత సంబరాలు చేసుకున్నారు. నిజానికి ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ చెల్లుబాటుపై అనేక సందేహాలు ఉన్నాయి. ఇలా ఆర్డినెన్స్ తో రిజర్వేషన్లు పెంచుకునే చాన్స్ ఉంటే కేసీఆర్ ఎప్పుడో ఇచ్చేసి ఉండేవారు. ఈ లాజిక్ కవిత మర్చిపోయినట్లుగా నటించి సంబరాలు చేసుకున్నారు.
కవిత బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడారు. ఈ పోరాటం ఫలించిందని క్రెడిట్ తనకు కట్టబెట్టుకోవడం కోసం ఈ సంబరాలు ప్లాన్ చేశారని కొంత మంది సమర్థించుకుంటున్నారు. అయితే ఆమె తాను ఇంకా బీఆర్ఎస్ నేతనేనని అంటున్నారు. బీఆర్ఎస్ అభిప్రాయం కూడా.. అదేనా..?. బీఆర్ఎస్ కూడా ఈ సంబరాలు ఇలా చేసుకుంటుందా ?. అదే ఇతరులకు అర్థం కావడంలేదు. మొత్తంగా కవిత రాజకీయాలు మాత్రం..ఊహించని విధంగా ఉంటున్నాయి.