ఓట్ల చోరీ అంటూ విపక్షాలు చేస్తున్న ఆందోళనల వెనుక విదేశీ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత ఆయన మాట్లాడారు. తాము గెలిచినప్పుడు న్యాయంగా ఉందని.. ఓడిపోయినప్పుడు ఓట్ల చోరీ అని ఆరోపణలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశం పురోగతిలో ఉన్నప్పుడు మనల్ని నియంత్రించడానికి విదేశీ శక్తులు.. అంతర్గత శక్తుల్ని వాడుకుని అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తాయని .. ఇప్పుడు అదే జరుగుతోందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలతో ఓడిపోతే.. ఈవీఎంల ట్యాంపరింగ్ అని.. బ్యాలెట్లో ఓడిపోతే రిగ్గింగ్ అని ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉంటే.. అంతగా ప్రజాస్వామ్యం నిలబడుతుంది. నమ్మకమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. అయితే రాహుల్ గాంధీ మాత్రం నేరుగా ఈసీపైనే దాడి చేస్తున్నారు. తాము ఓడిపోవడానికి ఈసీనే కారణం అని రాహుల్ నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే జగన్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని నిన్నటి వరకూ ఏడ్చిన ఆయన.. బ్యాలెట్లతో జరిగే ఎన్నికల్లో మాత్రం రిగ్గింగ్ అని గందరగోళం సృష్టిస్తున్నారు.
భారత్ పై కుట్రలు చేసేందుకు , ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసేందుకు బయట శక్తులు ప్రయత్నిస్తున్నాయని .. అంతర్గత శక్తులు సహకరిస్తున్నాయన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మరీ సత్యదూరం ఏమీ కాదని.. అలాంటి చాన్సులు ఉన్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ పై ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో భారత్ పై వ్యతిరేక ప్రకటనలు చేస్తూంటారని.. భారత్ పై కుట్రలు చేసే ఓ అమెరికా వ్యాపారవేత్తతో టచ్ లో ఉంటారని బీజేపీ ఆరోపిస్తూ ఉంటుంది.