నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘వీర సింహారెడ్డి ‘ ఘన విజయాన్ని అందుకొంది. అదే నమ్మకంతో.. ఇప్పుడు గోపీచంద్ కు మరో అవకాశం ఇచ్చారు బాలయ్య. ఆయనకు ఇది 111వ చిత్రం కావడం విశేషం. చాలా రోజుల క్రితమే ఈ స్క్రిప్టుని గోపీచంద్ లాక్ చేసేశారు. బాలయ్య పుట్టిన రోజున అధికారికంగా మొదలవ్వాల్సివుంది. అయితే కాస్త ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఈనెల 24న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నవంబరులో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ‘అఖండ 2’ డిసెంబరు 5న విడుదల కానుంది. ఆ హడావుడి అయిన తరవాత.. ఇక షూటింగ్ చక చక జరిగిపోతుంది.
ఈ సినిమా కోసం టెక్నీషియన్లు, ఇతర నటీనటుల ఎంపిక దాదాపు పూర్తయినట్టే. కెమెరామెన్‌గా ‘కాంతార’ ఫేమ్ అరవింద్ కాశ్యప్‌ని ఎంచుకొన్నారు. సంగీత దర్శకత్వ బాధ్యతలు తమన్‌కి అప్పగించారు. ఈమధ్య బాలకృష్ణ అంటే సంగీత దర్శకుడిగా తమన్ పేరే వినిపిస్తోంది. అఖండ, వీర సింహారెడ్డి, డాకూ మహారాజ్, అఖండ 2.. ఇలా బాలయ్యతో తమన్ కెమిస్ట్రీ సాగుతూనే ఉంది. అందుకే ఇప్పుడు మరోసారి ఆ బాధ్యతలు తమన్ చేతికి వెళ్లాయి. కథానాయిక, ఇతర వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి. బాలయ్యని గోపీచంద్ నెవర్ బిఫోర్ అవతార్‌లో చూపించబోతున్నారని, బడ్జెట్ పరంగానూ ఇది బాలయ్య కెరీర్లో భారీ సినిమా అని తెలుస్తోంది.