జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి పర్యటన కామెడీ షోగా మారింది. జన సమీకరణ చేయలేకపోయారు. కానీ వర్షంలో మాత్రం నాలుగు ఫోటోలు తీసి.. బీభత్సమైన రైటప్‌లతో సోషల్ మీడియా కార్యకర్తలు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అన్నీ కామెడీ అయిపోయాయి. జగన్ రెడ్డి మాకవరం పాలెం పోయి ఏమైనా కాలేజీని చూశారా అంటే అదీ లేదు. మొండిగోడలు చూసే ధైర్యం లేకపోయింది. మీడియాతో మాట్లాడి.. ఎప్పట్లాగే పడికట్టు పదాలతో ఆరోపణలు చేసి తన దారిన తానుపోయారు.
జగన్‌ను జనం పట్టించుకోవడంలేదు !
ఈ పర్యటన వల్ల ఆయనకు వచ్చిందేమీ లేకపోగా.. జనం పట్టించుకోవడంలేదని .. పెయిడ్ జనాన్ని తీసుకువచ్చే నేతలు కూడా నిరాసక్తంగా ఉన్నారని తేలిపోయింది.
అసలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాలే ఔట్ డేటెడ్. తాను ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి వ్యూహాలు ఇంకా పాటిస్తున్నారు. పది మందిని పోగేసి.. క్లోజప్‌లో తోపులాట చూపిస్తే.. అబ్బా జగన్ కోసం ఏం జనం వచ్చార్రా అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే చాలని జగన్ అనుకుంటున్నారు. కానీ అసలు గ్రౌండ్ లెవల్ రియాలిటీ తెలుసుకుని దానికి తగ్గట్లుగా రాజకీయాలు చేద్దామన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి మాకవరం పాలెం వరకూ జగన్ రెడ్డి ఆరు గంటలు వెళ్లారు. ప్రతి చోటా ఓ స్కిట్ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ అవన్నీ చూసి వైసీపీ కార్యకర్తలే నవ్వుకున్నారు. ఇలా డ్రామాలు ఆడటం రాజకీయం కాదు బాసూ అని మనసులో అనుకుని ఉంటారు.
చేసిన నిర్వాకాలు ప్రజలు మరచిపోతారా ?
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపారని.. కేంద్రానికి ధన్యావాదాలు చెబుతూ శాసనమండలిలో వైసీపీ తీర్మానం చేసింది. కానీ స్టీల్ ప్లాంట్ కార్మికుల పేరుతో కొంత మందిని పిలిపించుకుని తాడేపల్లిలో సమావేశం అవుదాం.. స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడదాం అని చెప్పుకొచ్చారు. ఆ వచ్చిన వాళ్లలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరో ఎవరికీ తెలియదు. అలా ఆయన వద్దకు సమస్యలతో ఎవరో వచ్చారని చెప్పుకునేందుకు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు.
ఐదు ఏళ్ల పాలన చూశారు కదా.. ఇంకా నేను వచ్చి ఉంటే అనే కబుర్లెందుకు ?
జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనను ప్రజలు చూశారు. అంత తేలికగా ఆ పాలనను మర్చిపోరు. మర్చిపోకుండా జగన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన నిర్వాకాలు గుర్తు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన తాను వస్తే ప్రజలంతా స్వర్గంలో ఉండేవారని చెప్పుకోవడం కన్నా.. తాను వస్తే గతంలో జరిగిన తప్పులు జరగనివ్వనని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజల్లో ఏమైనా మార్పు కలిగే అవకాశం ఉంటుంది. అంతే కానీ నేను వస్తే పిల్లలు ఇంగ్లిష్ లో మాట్లాడేవాళ్లు.. నేను వస్తే కాలేజీలు కట్టేసేవాడ్ని..నేను వస్తే ప్యాలెస్ లో చేరిపోయేవాడ్ని అంటూ కబుర్లు చెబితే.. ప్రజలు ఇంకా పిచ్చితగ్గలేదనుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది.
కొంచెమైనా నిజాయితీ రాజకీయాలు ఉండాలి !
అసెంబ్లీకి వెళ్లడానికి భయపడటం, ఇలా కళ్ల ముందు కనిపించే నిజాలను అబద్దాలుగా ప్రచారం చేసి రాజకీయం చేయడం, కృత్రిమ జనసమీకరణాలతో గాలి నింపుకోవాలనుకోవడం ఇప్పుడు జరగవు. ఏదైనా ప్రజల కోసం నిజాయితీగా పని చేస్తే గుర్తిస్తారు. అది తెలిసేలా జగన్ కు ఓ స్ట్రాటజిస్టు అవసరం ఇప్పుడు ఎంతో ఉంది.