తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తూంటే ఎవరికైనా ఇదేనా ప్రాంతీయ పార్టీలో ఉండే క్రమశిక్షణ అని అందరూ ఆశ్చర్యపోతారు. జాతీయ పార్టీలో అయితే పార్టీ హైకమాండ్ రాష్ట్ర స్థాయిలో ఒక్కర్నే ప్రోత్సహించకుండా.. నాలుగైదు గ్రూపులు మెయిన్ టెయిన్ చేస్తుంది. అది వారి వ్యూహం. అందుకే కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీల్లో ధిక్కార స్వరాలు కాస్త ఎక్కువగానే వినిపిస్తూంటాయి.కానీ ప్రాంతీయ పార్టీల్లో అలా ఉండకూడదు. అలా ఉంటే.. నాయకత్వం బలహీనంగా ఉన్నట్లే. ఇప్పుడు టీడీపీలో అదే పరిస్థితి కనిపిస్తోంది.
సహనాన్ని పరీక్షిస్తున్న కొలికపూడి
పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన కొలికపూడి శ్రీనివాస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం సహనాన్ని పరీక్షిస్తున్నారు. గెలిచినప్పటి నుండి అత్యుత్సాహంతో ఆయన చేసిన పనులను పార్టీ సీరియస్ గా తీసుకుంది. అసలు నియోజకవర్గంలో వేలు పెట్టవద్దని కూడా ఓ సారి చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అది మరింత ముదిరింది. ఎంపీ చిన్నీకి టిక్కెట్ కోసం డబ్బులు ఇచ్చానని ప్రకటించడం మరింత వివాదాస్పదమయింది. దానిపై ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఎంపీని టార్గెట్ చేశానని అనుకుంటున్నారు.. కానీ పార్టీనే దెబ్బకొడుతున్నారు.
అంతర్గతంగా మరికొంత మంది నేతల రచ్చ
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో కొంత మంది నేతలు చేస్తున్న రాజకీయాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి. వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధాలు పెట్టుకోవద్దని..లోపాయికారీ రాజకీయాలు వద్దని చంద్రబాబు చాలా సార్లు సూచించినా.. పార్టీ నేతలు వదిలి పెట్టడం లేదు. అనేక మంది వైసీపీ నేతలతో కలిసి దందాలు చేస్తున్నారు. పార్టీకి స్పష్టమైన సమాచారం ఉండి.. హెచ్చరికలు జారీ చేసినా.. వారు పట్టించుకోవడం లేదంటున్నారు.
కొంతమందిపై చర్యలు తీసుకుంటేనే దారికొస్తారు !
కొలికపూడి శ్రీనివాస్ 2019కి ముందు జగన్ అభిమాని. ఆయన ఏం చేసినా.. సాక్షి చానల్లో కూర్చుని సెల్యూట్ కొడుతూ ఉండేవారు. అమరావతి ఉద్యమంలో ఆయన కీలకంగా పాల్గొనడంతో చంద్రబాబు ఆయనకు స్పేస్ లేకపోయినా .. అవకాశం సృష్టించి ఇచ్చారు. కానీ ఆయన రాజకీయాలను అర్థం చేసుకోలేక.. కాలదన్నుకున్నారు. రోజు రోజుకు ఆయన వివాదాలు పెరిగిపోతున్నాయి. ఆయనను అలా సహించి చూస్తూ ఉంటే.. రేపు మరొకరు తయారు అవుతారు. అవసరం అయితే ఆయనతో రాజీనామాలు చేయించడం లేదా.. అనర్హతా వేటు వేసి.. ఉపఎన్నికలు తీసుకు రావడం వంటి చర్యలు తీసుకుంటేనే.. పార్టీని దక్కించాలనుకునేవారు కాస్త వెనక్కి తగ్గుతారని టీడీపీ క్యాడర్ పార్టీ హైకమాండ్ కు చెబుతున్నారు. కానీ ఎన్ని వివాదాలు వచ్చినా సర్దుకుపొమ్మని చెప్పడమే టీడీపీ నాయకత్వం ఇంత కాలం చేస్తోంది. ఇక ముందు కూడా అదే చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
