కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా స్థిరపరిచేందుకు బీఆర్ఎస్ తొందరపడుతోంది. ఇప్పుడు కాలం కలసి రావడం లేదనితెలిసినా అదే పని చేస్తోంది. జాతిపిత అని ఆయనను సొంత మీడియాలో, సోషల్ మీడియాలో కీర్తించడం వల్ల గుర్తింపు రాదు. ప్రజల నుంచి రావాలి. టీఆర్ఎస్ ను..బీఆర్ఎస్ గా మార్చినప్పుడుఆ.. ప్రయోగం ఫెయిలయితే.. ఇంతకాలం సంపాదించిన పేరు ప్రఖ్యాతులన్నీ తుడిచిపెట్టుకుపోతాయని ఎంతో మంది విశ్లేషించారు. అన్నట్లుగానేజరిగింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఓ సాదాసీదా నాయకుడిగా మిగిలిపోయారు.
తెలంగాణ క్రెడిట్ కేసీఆర్ ఒక్కరిదే కాదన్న వాదనకు బలం
ఉద్యమ కాలంలో ఉన్న కేసీఆర్ ఇమేజ్‌కు, అధికారంలో ఉన్నప్పటి కేసీఆర్ ఇమేజ్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల వైపు వెళ్లిన తరుణంలోనే, ఆయన తన ప్రాంతీయ అస్తిత్వాన్ని కొంత కోల్పోయారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ పాత ఇమేజ్ను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర అమోఘం అన్నది ఎవరూ కాదనలేని సత్యం. అయితే, ఆ క్రెడిట్ కేవలం ఒక్క వ్యక్తికే చెందుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. శ్రీకాంతాచారి ప్రాణత్యాగం నుంచి మిలియన్ మార్చ్ వరకు సామాన్య ప్రజలు, విద్యార్థులు చేసిన పోరాటాలను పక్కన పెట్టి, కేవలం కేసీఆర్‌నే కేంద్రబిందువుగా చూపడం ఇతర వర్గాలకు మింగుడు పడటం లేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మిగిలిపోయిన వేళ, ఈ జాతిపిత చర్చ ఆయన పాత వైభవాన్ని తలచుకునేలా కంటే, గత వైఫల్యాలను ఎత్తిచూపేలా మారుతోంది.
రేవంత్ రెడ్డి బుల్ డోజర్ వ్యూహం
కేసీఆర్‌ను కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఒక వర్గానికి లేదా కులానికి పరిమితం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీయడానికి ఆయన వేస్తున్న ఎత్తుగడలను ఎదుర్కోవడం బీఆర్ఎస్కు సవాలుగా మారింది. జాతిపిత చర్చ జరిగిన ప్రతిసారీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల త్యాగాలను, ఇతర సామాజిక వర్గాల పాత్రను తెరపైకి తెస్తూ కేసీఆర్ పాత్రను కేవలం కుల నాయకుడిగా మాత్రమే కుచించుకుపోయేలా చేసేలా చేస్తున్నారు. ఈ రాజకీయ యుద్ధంలో కేసీఆర్ స్థాయిని తగ్గించే ప్రమాదం పొంచి ఉంది.
బీఆర్ఎస్కు కలసి రాని కాలం
రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. ప్రస్తుతం బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి సమయంలో వివాదాస్పద చర్చల కంటే, ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం మేలనేది ఎక్కువ మంది భావన. జాతిపిత అనే అంశాన్ని ఎంతగా చర్చకు పెడితే, ప్రత్యర్థులకు అంతగా విమర్శించే అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ చర్చ పెరిగే కొద్దీ కేసీఆర్ ఉద్యమ నేత అనే గౌరవం తగ్గి, కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడిగానే ముద్ర పడే అవకాశం ఉంది. కాబట్టి, ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టడమే మంచిదని అనుకోవచ్చు.
