ఈరోజుల్లో ఓ సినిమాకి పాజిటీవ్ టాక్ రావడమే గగనం అయిపోతోంది. ప్రీమియర్ షోల నుంచే సినిమాల్ని మోసేస్తున్నారు. రివ్యూలు వచ్చేసరికే పోస్ట్ మార్టమ్లు మొదలైపోతున్నాయి. ఆ ప్రభావం వసూళ్లపై పడుతోంది. ఓ సినిమాకు ‘బాగుంది.. ఓకే’ అనే టాక్ వస్తే, అదే పదివేలు.
శుక్రవారం విడుదలైన ‘బైకర్’, ‘రాకాస’ సినిమాలు పాజిటీవ్ టాక్ సంపాదించుకొన్నాయి. `బైకర్`కు గురువారం ప్రీమియర్లు పడ్డాయి. అప్పటి నుంచి `బాగుంది` అనే టాక్ రన్ అవుతోంది. `రాకాస` చిన్న సినిమానే అయినా, నిహారిక చేసిన ప్రమోషన్ల వల్ల మంచి హైప్ దొరికింది. ఈ సినిమాకూ పాజిటీవ్ టాక్ వచ్చింది. ఓ సినిమాకు యావరేజ్ టాక్ వస్తే, గట్టిగా ప్రమోషన్లు చేసి ‘హిట్’` అనిపించుకొంటున్నారు నిర్మాతలు. ‘బైకర్’, ‘రాకాస’ కూడా అదే పనిలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలకూ శుక్రవారమే సక్సెస్ మీట్లు పెట్టేశారు. శుక్రవారం ఈవినింగ్ షోలకు పికప్ కనిపించింది. బుక్ మై షో టికెట్లు బాగానే తెగుతున్నాయి. శనివారం కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఆదివారానికి మరింత పికప్ అయ్యే ఛాన్సుంది. కొన్ని ఏరియాల్లో ‘బైకర్’ కంటే ‘రాకాస’కు వసూళ్లు బాగున్నాయి. మల్టీపెక్స్లలో `బైకర్` హవా చూపిస్తోంది. ఈ రెండు సినిమాల ప్లస్ పాయింట్స్ ఏమిటంటే.. క్లీన్ సినిమాలు. ఫ్యామిలీ అంతా చూసే సినిమాలు. సంక్రాంతి తరవాత ఫ్యామిలీ అంతా చూసే సినిమాలు పెద్దగా రాలేదు. ఇప్పుడు వాళ్లు మళ్లీ థియేటర్లకు కదిలే ఛాన్స్ వుంది. కాకపోతే.. ఈ యావరేజ్ టాక్ ని హిట్ సినిమాగా మార్చేకోవడానికి నిర్మాతలు కష్టపడాలి. ప్రమోషన్స్ విషయంలో గేర్ మార్చాలి. ఆదివారం కూడా వసూళ్లు బాగుంటే మాత్రం టాలీవుడ్ కి కాస్త ఉపశమనం కలిగినట్టే.
