ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా స్టాండప్ కామెడీ చేసిన హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను పోలీసులు అరెస్టు చేశారు. పవన్ కళ్యాణ్ వివాహాలు, విడాకులు.. నాగబాబు కుమార్తె నిహారిక విడాకులపై అనుదీప్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, జనసేన కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న అతడిని ప్రత్యేక బృందం ద్వారా గుర్తించి, అక్కడే అదుపులోకి తీసుకున్నారు.
అనుదీప్ గతంలో నిర్వహించిన ఒక స్టాండప్ కామెడీ షోలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లను ఉద్దేశించి సెటైర్లు వేశాడు. ఈ వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిపై, ఒక పార్టీ అధినేతపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం భావప్రకటనా స్వేచ్ఛ కిందకు రాదని, ఇది కేవలం వ్యక్తిత్వ హననమేనని పేర్కొంటూ కాకినాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, అనుదీప్ లోకేషన్‌ను ట్రేస్ చేసి ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లిన కాకినాడ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలపై ఇష్టానుసారంగా జోకులు వేసే వారికి ఈ అరెస్ట్ ఒక హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ అరెస్టుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జోకులు వేసినందుకు అరెస్ట్ చేయడం ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుంటే.. హాస్యం పేరుతో కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తప్పవని మరికొందరు సమర్థిస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించి వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
